దేవుడిపై రాజకీయ నేతల ముప్పేట దాడి.. ఇంతకీ రామతీర్థంలో ఏం జరిగింది..?

దేవుడిపై రాజకీయ నేతల ముప్పేట దాడి.. ఇంతకీ రామతీర్థంలో ఏం జరిగింది..?
x
Highlights

రామతీర్థంలో బల ప్రదర్శనకు దిగిన రాజకీయ పార్టీలు.. ఒకే రోజు తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ నేతల సందర్శన .. ఒకరిని ఒకరు అడ్డుకుని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన పార్టీలు..

రామతీర్థం రణరంగంగా మారింది. ప్రశాంతంగా ఉండాల్సిన కోవెల రాజకీయతీర్థంగా తయారైంది. దేవుడిపై రాజకీయ నేతల ముప్పేట దాడి తీవ్రమైంది. మూడు పార్టీల నేతలు పోటా పోటీగా దేవుడ్ని సందర్శించడానికి వెళ్ళారు. గుడి దగ్గర హై టెన్షన్‌ క్రియేట్‌ చేశారు. ఇంతకీ రామతీర్థంలో ఏం జరిగింది..?

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని ఆలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. ఆ మర్నాడే పోలీసులు ధ్వంసమైన శిరస్సును పక్కనే ఉన్న కోనేరులో కనుగొని ఆలయానికి అప్పగించారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అదే సమయంలో ఆలయంలో సంభవించిన దుర్ఘటన రాజకీయ బలప్రదర్శనకు దారి తీసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఒకేరోజు ఆయా పార్టీల కార్యకర్తలతో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు బాగా శ్రమించాల్సి వచ్చింది.

ఆలయం సమీపంలోనే మూడు పార్టీలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. చంద్రబాబు రాకతో..టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఆలయం దగ్గరకు చంద్రబాబు కాన్వాయ్‌ను మాత్రమే అనుమతించారు. మిగిలిన కార్లను పోలీసులు ఆపివేశారు. దీనికి నిరసనగా చంద్రబాబు రోడ్డుమీద బైటాయించారు. అయితే అప్పటికే ఆలయం ఉన్న కొండ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంతకుముందే.. కొండమీదకు వెళ్ళేందుకు అక్కడకు వస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారు మీద కొందరు రాళ్ళతో దాడికి దిగారు. ఆ కారు దిగి వేరే కారుమీద కొండ దగ్గరకు చేరుకున్నారు విజయసాయి. వైసీపీ నేత కిందికి వచ్చాక...చంద్రబాబు కొండమీదకు అనుచరులతో వెళ్ళారు. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆలయం దగ్గరకు వెళ్ళిన చంద్రబాబు...జరిగిన ఘటన గురించి పూజారిని అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రదేశమంతా కలియదిరిగి...అనంతరం కిందికి దిగివచ్చారు. చంద్రబాబు వెంట పార్టీ నేతలు అశోకగజపతిరాజు, అచ్చెన్నాయుడు తదితరులున్నారు. కిందికి దిగివచ్చాక కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. జగన్‌ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు. జగన్‌ది రాక్షస పాలనగా అభివర్ణించారు. 19 నెలల కాలంలో 127 ఆలయాల్లో దాడులు జరిగాయని లెక్క చెప్పారాయన. హిందూ ఆలయాలను కాపాడలేని ముఖ్యమంత్రి జగన్‌కు ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు తెలుగుదేశం అధినేత.

హిందూ ఆలయాల ఆస్తులు దోచుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక హిందూ ఆలయాల్లో విధ్వంసాలు పెరుగుతున్నాయని చెప్పారాయన. ఇదిలా ఉంటే తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరును ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా ఖండించారు. సంఘటన జరిగిన ఆలయం ప్రధాన దేవాలయం కాదని..దూరంగా కొండమీద జనసంచారం లేని ప్రాంతంలో ఉంటుందని చెప్పారు. అక్కడ సీసీ కెమెరాలు లేవని...వాటిని ఏర్పాటు చేయడానికి ఒకరోజు ముందు విగ్రహం ధ్వంసం చేశారని తెలియచేశారు మంత్రి వెల్లంపల్లి. దోషుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారాయన.

విగ్రహం ధ్వంసం చేసిన ఐదో రోజున రామతీర్థం రాజకీయ తీర్థయాత్రగా మారింది. మూడు పార్టీల బల ప్రదర్శనలకు వేదికైంది. దేవుని సాక్షిగా నాయకులు సవాళ్ళు..ప్రతి సవాళ్ళకు దిగారు. దేవుని సంకీర్తనలతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లిపోయింది. తెలుగుదేశం సభ ముగియడంతో ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories