Dil Ramesh: సినిమాల్లో నటుడినే..కానీ నేనూ రైతునే అంటున్న రమేష్

Integrated Farming By Actor Dil Ramesh
x

సినిమాల్లో నటుడినే....కానీ నేనూ రైతునే అంటున్న రమేష్

Highlights

Dil Ramesh: 200లకు పైగా సినిమాలు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. డబ్బుకు లోటు లేదు. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తి. ఎన్ని కోట్లు సంపాదించినా...

Dil Ramesh: 200లకు పైగా సినిమాలు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. డబ్బుకు లోటు లేదు. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తి. ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యానికి మించింది ఏదీ లేదని గుర్తించాడు. అందుకే తానే రైతు అవతారమెత్తాడు నటుడు దిల్ రమేష్ . మిత్రుల సహకారంతో ప్రకృతి విధానంలో సమీకృత సేద్యం చేస్తున్నాడు . ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ సాగు పాఠాలను అవపోస పట్టి సేద్యపు అనుభవం లేకున్నా ఆరోగ్యకరమైన పంటలను పండిస్తున్నాడు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందాడు నటుడు దిల్ రమేష్. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అంతా సజావుగా సాగుతున్నా ఎక్కడో తెలియని చిన్న వెలితి. ఎన్ని కోట్లు సంపాదించినా తీరని లోటు. అందుకు కారణం తినే ఆహారమేనని గుర్తించాడు దిల్ రమేష్. మనం తినే ఆహారంలో నిజమైన ఆరోగ్యం ఉందా అన్న ప్రశ్నే అతడిని సాగు వైపు నడిపించింది. తను కుటుంబానికి మాత్రమే కాదు సమాజానికి ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు. అందుకే రైతు అవతారమెత్తాడు దిల్ రమేష్. ప్రకృతి విధానంలో సమీకృత సేద్యం చేస్తున్నాడు.

హైదరాబాద్ నగర శివారులోని జిన్నారం మండలం మాదారం గ్రామం ఇది. ఇక్కడ తరతరాలుగా నేలను నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులు ఎంతో మంది ఉన్నారు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షేత్రం కాస్త ప్రత్యేకం. అందుకు కారణం ప్రకృతి సేద్యం. అవును రసాయనాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రయోగాత్మకంగా పండిస్తూ తోటి రైతుల్లో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రమేష్. తన స్నేహితుల సహాయ సహకారాలతో ఎకరంన్నర విస్తీర్ణంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల సాగు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను దిగుబడులుగా పొందుతున్నాడు. లాభాపేక్ష లేకుండా వ్యాపారకోణంలో ఆలోచించకుండా సేద్యం చేస్తూ తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ఏం చేస్తున్నామన్నది కాదు ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యం. అందుకే తన క్షేత్రంలో ఎలాంటి రసాయనాల ఊసు ఉండదు. వందకు వంద శాతం దేశవాళీ గోవుల నుంచి వచ్చిన వ్యర్థాలనే పంటలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. అదే సేద్యంలో తమ విజయానికి బాటలు వేస్తోందని దిల్ రమేష్ సగర్వంగా చెబుతున్నాడు. ప్రస్తుత సమయంలో కోట్ల ఆస్తి ఉన్నవాడు గొప్పడాడు కాదని ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా జీవించే వాడే నిజమైన కోటీశ్వరుడని అంటున్నాడు.

ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పాఠాలే దిల్ రమేష్ సాగు సూత్రాలు. ఎకరన్నరం విస్తీర్ణంలో రెండేళ్లుగా కేవలం గోవు వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులతో పంటలు పండిస్తున్నాడు. ప్రస్తుతం పొలంలో టమోట, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలి వంటి కూరగాయలతో పాటు విభిన్న రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. అదే విధంగా మామిడి, జామ, అరటిలో విభిన్న రకాలు ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. పంట సాగు కోసం దేశీయ విత్తనాలనే వినియోగిస్తున్నాడు. ఈ క్షేత్రంలో నల్లజామ, వాటర్ ఆపిల్ పండ్ల చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ క్షేత్రంలో పండిన పంటల నాణ్యత, నిల్వగుణం మార్కెట్ లో లభించే కూరగాయలకు ఉండదని చెబుతున్నాడు దిల్ రమేష్. ఇక్కడ పండే టమోటాను కోసి నెల రోజులు నిల్వ చేసినా ఎంతో తాజాగా ఉంటుందని అంటున్నాడు. ఆవుని నమ్ముకుని చేసే వ్యవసాయం అన్ని రకాలకు ఆదుకుంటుందని అంటున్నాడు దిల్ రమేష్. నటుడిగా పొందలేని సంతోషాన్ని సంతృప్తిని ప్రకృతి సేద్యం ద్వారా పొందుతున్నానని చెబుతున్నాడు. భావితరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదని ఆరోగ్యకరమైన ఆహారమేనని అది అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తున్నాడు.

తన వ్యవసాయక్షేత్రంలోనే ప్రత్యేకంగా ఓ షెడ్డును ఏర్పాటు చేసి సమీకృత వ్యవసాయంలో భాగంగా దేశవాళీ ఆవుల పెంపకం చేస్తున్నాడు. ఒంగోలు, పుంగనూరు, గిర్, కపిల జాతులకు చెందిన 19 దేశీ ఆవులను పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచుతున్నారు. వీటి పెంపకం ద్వారా శ్రేష్టమైన పాలతో పాటు పంటలకు కావాల్సిన ప్రకృతి ఎరువు లభిస్తోందని అంటున్నాడు. అంతే కాదు ఆవుల మేతకు కావాల్సన గ్రాసాలను తన క్షేత్రంలోనే ఆవు వ్యర్థాలతోనే పండిస్తున్నాడు. అలాగే మేకలతో పాటు చేపలను ప్రత్యేక ట్యాంకులు ఏర్పాటు చేసి పెంచుతున్నాడు. చేపల తొట్టెలోని నీటిని వృధాగా పోనీయకుండా పంటలకు డ్రిప్ ద్వారా పారిస్తున్నాడు.

ఒక్క ఆవు వుంటే చాలు 30 ఎకరాల్లో పంటలు పండించవచ్చన్నది పాలేకర్ సూచించిన విధానం ఆ విధానాన్ని నమ్మి ఆకుకూరలు, కూరగాలతో పాటు కొంత స్థలాన్ని ఆవుల పెంపకం కోసం కేటాయించాడు. వాటిని దాణాను పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తున్నాడు. పచ్చిమేత గ్రాసాలైన సూపర్ నేపియర్, కో ఫోర్ వంటి గ్రాసాలను కొద్దిపాటి స్థలంలో పెంచుతున్నాడు. తద్వారా పశువులకు మేత కొరత రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరుగుతున్న ఈ దేశీగోవులు శ్రేష్టమైన పాలను అందిస్తున్నాయని వాటిని తాగటం వల్ల తమ ఆరోగ్యం ఎంతో మెరుగైందని దిల్ రమేష్ చెబుతున్నాడు.

సమీకృత వ్యవసాయంలో భాగంగా చేపల పెంపకాన్ని చేపట్టాడు. కొద్ది మొత్తం స్థలంలో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసుకుని కొర్రమీను చేపలను పెంచుతున్నాడు. 15 రోజులకు ఒకసార మార్చే నీటిని వృథాగా పోనీయకుండా పంటలకు డ్రిప్ ద్వారా పారిస్తున్నాడు. సమీకృత సేద్యంలో ఇంకాఏమైనా కొత్త పద్ధతులు వస్తే వాటిని సైతం అనుసరిస్తామని చెబుతున్నాడు.

ఈ ప్రపంచంలో నష్టానికి వ్యాపారం ఎవ్వరూ చేయారు. ఒకసారి వ్యాపారంలో నష్టం వస్తే దాని జోలికి రెండోసారి వెళ్లరు. కానీ కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక్క రైతు మాత్రమే ఏళ్లుగా సేద్యంలో నష‌్టపోతున్నా కాడిని మాత్రం వీడటం లేదు. ఆదాయం రాదని తెలిసినా కష్ట నష్టాలను దిగమింగుకుని, నేలతల్లిని నమ్ముకుని పంటలు పండిస్తూనే ఉన్నాడు. అలాంటి రైతు శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిస్తున్నాడు దిల్ రమేష్ . భావోద్వేగమైన కవిత ద్వారా రైతుపై తనకున్న భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు.

ఏ పని చేసినా అందులో ఆసక్తి ఉండాలి. పట్టుదల తోడైతే సత్ఫలితాలు సొంతమవుతాయి. అదే చేసి చూపిస్తున్నాడు దిల్ రమేష్. సమీకృత సేద్యం చేస్తూ తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలని పిలుపునిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories