Mango Farmers: కొల్లాపూర్ మామిడి రైతులకు దక్కిన భరోసా

Kolhapur Mango Farmers Assured of Subsidy and Funds to Export Crops
x

Mango Farmers: కొల్లాపూర్ మామిడి రైతులకు దక్కిన భరోసా

Highlights

Mango Farmers: ఏటా ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా నిత్యం మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు.

Mango Farmers: ఏటా ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా నిత్యం మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు కాకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితులు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మామిడికి మార్కెట్ సదుపాయాలు పెద్దగా లేకపోవడంతో దళారులకే పంటను అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్ డెవల్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇటీవలే ఎంపిక చేసింది. మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు మామిడి ఎగుమతి చేసేందుకు అవసరమైన సదుపాయాల కోసం దాదాపు వంద కోట్లు కేటాయించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై పాలమూరు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఉద్యాన పంటలకు ప్రపంచ విపణిలో పోటీ పెంచేందుకు కేంద్రం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఉద్యాన సామూహిక అభివృద్ధం కార్యక్రమం పేరిట 11 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో 7 రకాల పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, విదేశీ ఎగుమతులు పెంచనుంది. మొత్తం 53 ఉద్యాన క్లస్టర్లలో చేపట్టనున్న కేంద్రం తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద 12 క్లస్టర్లలో అమలు చేయనుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు కేటాయించనుంది. దేశంలో మామిడి, అరటి, ద్రాక్ష, పైనాపిల్, దానిమ్మ, పసుపు, యాపిల్ ఉత్పత్తి, ఎగుమతులు 25 శాతం పెంచాలనేది ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ ఏడు రకాల పంటల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించి ఆ ఉత్పత్తులకు మంచి ధర, మార్కెటింగ్, దేశ , విదేశాలకు ఎగుమతుల కోసం వసతులు కల్పించనుంది.

తెలంగాణలో ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ఉద్యాన సంస్థ వ్యవహరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 వేల855 ఎకరాల విస్తీర్ణంలో 17వేల 284 మంది రైతులు మామిడి సాగు చేస్తున్నారు. వీరికి రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్రం ఇవ్వనుంది. మార్కెటింగ్ కోసం 10 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయనుంది. గద్వాల జిల్లాలోని 49 వేల టన్నుల నిల్వ సామర్థ్యం గల 7 శీతల గిడ్డంగులు, మహబూబ్‌నగర్‌లో మూడు 15 వేల టన్నుల గిడ్డంగులు, నాగర్‌కర్నూల్ లోని 5 వేల టన్నుల సామర్థ్యం గల ఒక శీతల గిడ్డంగిని నిర్మిస్తారు. మామిడి పండ్ల శుద్ధి, ప్యాకింగ్, ప్యాక్ హౌజుల్లో శీతల గదులను ఏర్పాటు చేస్తారని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి.

నిత్యం నష్టాల్లో ఉన్న ఉమ్మడి జిల్లా మామిడి రైతులకు భవిష్యత్తులో మంచి రాజులు రానున్నాయి. ముఖ్యంగా కొల్లాపూర్ బేనీషాన్‌గా ప్రసిద్ధిగాంచిన మామిడికి కేంద్రం సరైన గుర్తింపునిచ్చిందని కొల్లాపూర్ రైతులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సాగు నుంచి దేశ, విదేశీ మార్కెట్లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించనుంది. ఫలితంగా రైతుల ఆదాయంతో పాటు తెలంగాణ బ్రాండ్ మరింత ఖ్యాతి సంపాదించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories