Top
logo

ఇక్కడి నారు మొక్కలకు.. దేశవ్యాప్తంగా భలే డిమాండ్

Lemon Trees Cultivation Techniques by Citrus Research Station Tirupati
X

ఇక్కడి నారు మొక్కలకు.. దేశవ్యాప్తంగా భలే డిమాండ్

Highlights

Lemon Trees Cultivation: మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత సిట్రస్ పండ్లు మూడో స్థానాన్ని ఆక్రమించాయి.

Lemon Trees Cultivation: మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత సిట్రస్ పండ్లు మూడో స్థానాన్ని ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా చీనీ, నిమ్మ తోటల విస్తీర్ణంలో, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సిట్రస్ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుండటంతో వీటి ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ఇదే క్రమంలో తిరుపతిలోని చీనీ నిమ్మ పరిశోధన స్థానం బత్తాయి, నిమ్మ పంటలపై వందలాది పరిశోధనలు జరుపుతోంది. రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించి, చీడపీడలను నియంత్రించి, మేలైన దిగుబడిని అందించే రకాలను అందించేందుకు కృషి చేస్తోంది.

1968 సంవత్సరంలో తిరుపతిలో చీనీ నిమ్మ పరిశోధన స్ధానం ఏర్పాటైంది. ఈ స్థానంలో యావత్ భారత్‌దేశంలో జరిగే అన్ని పరిశోధనలను శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధన స్థానంలో ప్రస్తుతం 31 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఉద్యానవన శాఖకు చెందినవి 22 ప్రాజెక్టులు కాగా తెగుళ్ల యాజమాన్యానికి సంబంధించినవి 4 ప్రాజెక్టులు. ఇవే కాకుండా రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే అన్ని సమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలను చూపేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ప్రధానంగా చీనీ, నిమ్మలో సేంద్రియ వ్యవసాయం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ, సూక్ష్మదాతు లోపాలపైన పరిశోధనలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.

ఎస్సీ సబ్‌ ప్లాన్ కింద ఎస్సీలను ఒక యూనిట్ గా తీసుకుని ఈ సంస్థ ద్వారా వారికి కావాల్సిన పనిముట్లు, ఎరువులను అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సబ్ ప్లాన్ కింద ఒక యూనిట్ ను అనంతపురంలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటి ఫలాలను అందుకున్న రైతులు 20 శాతానికిపైగా అధిక ఆదాయం పొందారని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న రైతులు సాగులో విజయం సాధిస్తున్నారని పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు తెలిపారు.

ఎలాంటి చీడపీడలు లేని మొక్కలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన స్క్రీన్ హౌస్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ స్క్రీన్ హౌస్ లో సురక్షిత వాతావరణంలో పెరిగిన మొక్కలను రైతులకు అందిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 75వేల నుంచి లక్షల మొక్కల వరకు రైతులకు ఇస్తున్నామని ప్రధాన శాస్త్రవేత్త తెలిపారు. ఓ వైపు మొక్కలపైన పరిశోధనలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా వెబినార్ లను నిర్వహించి రైతుల్లో ఉద్యాన పంటల సాగుపైన అవగాహన పెంచుతున్నారు. చీనీ, నిమ్మ సాగు విస్తీర్ణాన్ని పెంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు చేస్తున్నామని డాక్టర్ నాగరాజు తెలిపారు.

ఉద్యాన విభాగంలో జన్యు సంబంధిత నిమ్మ జాతి రకాలను అభివృద్ధి చేసి వాటిని పరిశీలిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్తలు. ఈ రకాలు ఎటువంటి తెగుళ్లను, పురుగులను తట్టుకుంటాయి నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కుంటాయా అనేదానిపై వందలాది పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పంపర పనస రకాన్ని గ్రే ఫ్రూట్ ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. బత్తాయిలోనూ సాత్‌గుడీ రకంతో పాటు వేరే రకాలపైనపరిశోధనలు జరుగుతున్నాయి. నిమ్మలో కూడా అధిక దిగుబడిని ఇచ్చి గజ్జి తెగులును తట్టుకునే 38 రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో టిఐఎల్‌ 94 రకం, టిఐఎల్ 94 13 అనే రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

బత్తాయిలో సాత్‌గూడి రకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి లభిస్తుండటంతో రైతులు ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నారు. సాత్‌గుడీతో పాటే మాల్టా రకాన్ని పండించేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాత్‌గూడి చీనీ రకం 95వేల 982 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. 23 లక్షల టన్నుల దిగుబడి, హెక్టారుకు 24 టన్నుల ఉత్పాదకతతో 4607 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అనంతపురం, కడప, ప్రకాశం, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఈ రకం బత్తాయి తోటల సాగు విస్తృతంగా జరుగుతోంది. తెలంగాణలోనూ ఈ రకం 25వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుండగా 5లక్షల 10 వేల టన్నుల దిగుబడి, హెక్టారుకు 20 టన్నుల ఉత్పాదకతతో 1020 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్‌, యాదాద్రి-భువనగిరి జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, జిల్లాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి.

చీనీ నిమ్మ పరిశోధన స్థానంలో బత్తాయి పంటపై పరిశోధనలు, రైతు పొలాల్లో సర్వే చేసి పరిశీలించినప్పుడు చీనీ రకాలపైన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. రైతులు విదేశాల నుంచి పరిచయమైన ఇతర బత్తాయి రకాలైప మాల్టా, బ్రెజీలియన్, వెలెన్షియా, హామ్లిన్ బత్తాయి గురించి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిపైన ఇప్పటికే చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో అనేక పరిశోధనలు జరిగాయి. 1980లో వచ్చిన నాటి ఫలితాల ప్రకారం దక్షిణ భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాత్‌గుడి రకమే అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తినిచ్చే రకంగా గుర్తించారు.

సాత్‌గుడి రకాన్ని పరిశీలిస్తే ఎకరాకు 110 మొక్కలను నాటుకోవచ్చు. నాలుగున్నర నుంచి 5 సంవత్సరాలకు దిగుబడి ప్రారంభమవుతుంది. దీని పంట కాలం 240 నుంచి 270 రోజులు. ఒక చెట్టుకు ఎడగారు పంటలో సరాసరి 250 నుంచి 280 కాయల దిగుడి వస్తుంది. ఎకరాకు 5 టన్నుల వరకు పండ్లను పొందవచ్చు. ఒక్కో పండు బరువు 160 గ్రాముల వరకు ఉంటుంది. కాయకు 10 నుంచి 14 విత్తనాలుంటాయి. 0.6 నుంచి 0.9 శాతం పులుపు కలిగి ఉంటుంది.

ఇక మాల్టా రకాన్ని పరిశీలించినట్లయితే ఎకరాకు 120 మొక్కలు నాటుకోవచ్చు. నాటిని మూడున్నర నుంచి 4 ఏళ్లకు దిగుబడి ప్రారంభమవుతుంది. 280 నుంచి 290 రోజుల పంట కాలం చెట్టుకు కాయలు గుత్తులుగా ఒకే సైజులో ఉండటం ఈ రకం ప్రత్యేకత. చెట్టుకు సరాసరి 180 నుంచి 200 కాయల దిగుబడితో ఎకరాకు 5 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు. కాయ బరువు 180 నుంచి 210 గ్రాముల వరకు ఉంటుంది. 41 నుంచి 45 శాతం రసం కలిగి ఉంటుంది. కాయకు 7 నుంచి 9 విత్తనాలుంటాయి. 0.65 నుంచి 0.70 శాతం పులుపు కలిగి ఉంటుంది.

చీనీలో , నిమ్మ తోటలను ప్రధానంగా ఆకుముడత, పొలుసు పురుగులు, మంగు నల్లి , ఎర్ర నల్లి వంటి పురుగులు ఆశిస్తాయి. నారు దశ నుంచి కాయలు కోసే వరకు వివిధ దశల్లో పురుగులు ఆశిస్తాయి. ఇక నిమ్మలో గజ్జి తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. చీనీలో వేరుకుళ్లు, బంక తెగులు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చీడపీడలను నివారించేందుకు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిపైన గత 20 ఏళ్లుగా పరిశఓధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మేలైన పద్ధతులను రైతులకు చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ పద్ధతులను పాటించిన రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు.


Web TitleLemon Trees Cultivation Techniques by Citrus Research Station Tirupati
Next Story