Organic Farming: ఐదంచెల సేద్యం.. రైతుకు వరం

Organic Farming: Farmer Anji Reddy Success Story
x

Organic Farming: ఐదంచెల సేద్యం.. రైతుకు వరం

Highlights

Organic Farming: ప్రస్తుత కాలంలో తినే ఆహారం, గాలి, నీరు అన్నీ కలుషితమవుతున్నాయి. కొనే ప్రతి వస్తువులో నాణ్యత ఎంత అన్నది ప్రశ్నార్ధకమే.

Organic Farming: ప్రస్తుత కాలంలో తినే ఆహారం, గాలి, నీరు అన్నీ కలుషితమవుతున్నాయి. కొనే ప్రతి వస్తువులో నాణ్యత ఎంత అన్నది ప్రశ్నార్ధకమే. ఈ తరుణంలో అసలు కల్తీలేని ఆహారం అందరికీ అందడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు సమాధానంగా నిలుస్తోంది ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం. మితిమీరిన రసాయనిక సేద్యానికి ప్రకృతి వైద్యం తప్పనిసరి అన్నది నిపుణుల మాట. ఈ విషయాన్ని గుర్తించిన చాలా మంది రైతులు పాలేకర్ ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరించి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటివారిలో నల్గొండ జిల్లాకు చెందిన రైతు అంజిరెడ్డి ఒకరు. రసాయనాలు రాజ్యం ఏలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా గుర్తించారు ఈ రైతు. ఏడాది పొడవునా ఏదో ఒక పంట నిత్యం చేతికందే విధంగా పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఒకటైన ఐదు అంచెల సాగు పద్ధతిని అనుసరించి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మనిషి మనుగడకు ఆహారం ఎంతో అవసరం. కోటి విద్యలు కూటికొరకే అనేది జగమెరిగిన సత్యం. పూర్వం రోజుల్లో రసాయన ఎరువులు వాడని ఆహారం, స్వచ్ఛమైన నీరు, గాలి లభించాయి కాబట్టే నేటికి చాలా మంది వృద్ధులు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. కానీ 1965 సంవత్సరంలో వచ్చిన హరిత విప్లవం పుణ్యమా అందరికీ ఆహారం అందాలన్న ఒకే ఉద్దేశంతో ఇష్టారీతిలో పంటల సాగులో రసాయన క్రిమిసంహారక మందుల వినియోగం పెంచారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పంటల సాగులో రసాయనాల వినియోగం పెరిగిపోతుండటంతో ఇటు భూమికి అటు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నేలతల్లి తనలో సహజసిద్ధంగా ఉన్న పోషకాలను కోల్పోడంతో పంటల దిగుబడి తగ్గి రైతుకు రాబడి రావడం లేదు ఈ నేపథ్యంలో రైతుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ సమయంలో రసాయన రహిత సేద్యం చేయాలంటే ప్రకృతి వ్యవసాయమే రైతుల ముందున్న ప్రత్యామ్నాయ పద్ధతిగా కనిపిస్తోంది. ఆ దిశగా రైతులను నడిపించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకర నల్గొండ జిల్లాకు చెందిన అంజి రెడ్డి.

నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామానికి చెందిన రైతు అంజిరెడ్డి తనకున్న 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో గత ఐదేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఎలాంటి కలుపు, పురుగు మందులు , ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి విధానాలను అనుసరించి ఉద్యాన పంటలైన పండ్లు కూరగాయలను సాగు చేస్తున్నారు. దేశీ ఆవు నుంచి సేకరించిన వ్యర్థాలైన ఆవుపేడ, మూత్రాన్నే పంటలకు ఉపయోగిస్తున్నారు. తద్వారా నేలలో సహజ సిద్ధమైన పోషకాలను పెంపొందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన, తాజా ఆహార ఉత్పత్తులను అందించగలుగుతున్నారు.

నేలను నమ్ముకుని వ్యవసాయం చేసే రైతు ఆ నేలను సంరక్షించాల్సిన బాధ్యత ఉందని రైతు అంజిరెడ్డి చెబుతున్నారు. కానీ రసాయనాల వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా పండుతున్న ఉత్పత్తులను తింటున్నవారు దీర్ఘకాలిక , ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. ఏం పండించామన్నది కాదు ఎంత ఆరోగ్యరమైన ఆహారం అందరికీ అందిస్తున్నాము అన్నది ప్రతి రైతు గుర్తించాలని సూచిస్తున్నారు. అందుకే తన క్షేత్రంలో జీవవైవిధ్యం ఉట్టిపడేలా ఐదంచెల సేద్యపు విధానాన్ని అనుసరిస్తున్నారు పంటలు సాగు చేస్తున్నారు. నేలతల్లి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు.

ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి బత్తాయి. నిమ్మ, సపోట, జామ, బొప్పాయి, సీతాఫల్ వంటి పండ్ల తోటలను సహజ సిద్ధ ప్రకృతి విధానాల ద్వారా పెంచుతున్నారు. వీటితో పాటే కూరగాయలను సాగు చేస్తున్నారు. మొక్కలకు క్షేత్రంలో చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. పక్షులకు కూడా ఆవాసం ఏర్పడుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

రసాయనాలు, పురుగు మందులకు అలవాటు పడిన మొక్కలు సహజంగా పెరుగుతాయా అన్న ప్రశ్నకు అంజి రెడ్డి వ్యవసాయ క్షేత్రం సమాధానంగా చెబుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తికి అంజిరెడ్డి క్షేత్రం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సహజ సిద్ధమైన విధానాలను అనుసరించి ప్రకృతిని కాపాడుకుంటూ వ్యవసాయం చేయాలన్నదే తన ప్రధాన ఉద్దేశ్యమని రైతు అంజిరెడ్డి చెబుతున్నాడు. ఉద్యానాధికారులు సైతం అంజి రెడ్డి క్షేత్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఆయన సేద్యపు విధానాలు చూసి శభాష్ అంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడంలో భారతదేశం చాలా వెనుకబడి ఉందని ఉద్యానాధికారుల మాట. హరిత విప్లవం వచ్చి 56 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా కడుపు నింపుకోవడానికే ఆహారాన్ని పండిస్తున్నామని అంటున్నారు. కరోనా పుణ్యమా ప్రకృతి విధానంలో పోషకాలు కలిగిన ఆహారాన్ని తినాలన్న స్పృహ ఇప్పుడిప్పుడే వినియోగదారుల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలో అంజి రెడ్డి అనుసరిస్తున్న ప్రకృతి విధానాలవైపు తోటి రైతులు అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

ఏం తింటున్నామన్నది కాదు ఆ ఆహారంలో ఎంత మొత్తంలో పోషకాలు ఉన్నాయి అన్నదే ముఖ్యం. కాస్త ఖర్చు ఎక్కువైనా వినియోగదారులు ప్రకృతి , సేంద్రియ విధానంలో పండిన ఆకుకూరలు, కూరగాయలను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ సూచిస్తున్నారు. ప్రకృతి విధానంలో పంటలు పండించడం వల్ల నేలలో సారం పెరగడంతో పాటు పోషకాల ఆహారం లభిస్తుందని అంటున్నారు.

పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఐదంచెల వ్యవసాయ విధానం ఒకటి. ఆ విధానాన్ని అనుసరిస్తూ ఏడాది పొడవునా నిత్యం ఏదో ఒక ఆదాయం వచ్చే విధంగా తన 20 ఎకరాల క్షేత్రంలో పంటలు పండిస్తున్నారు ఈ రైతు. భూమిలోపల పండే పంటలు, భూమిపైన పండే పంటలు, వృక్షాల ఆధారంగా పండే తీగజాతి పంటలు, ఒక సంవత్సరంలో వచ్చేవి , రెండు సంవత్సరాల్లో వచ్చే వివిధ రకాల ఉద్యాన పంటలను పండిస్తున్నారు అంజిరెడ్డి. సీజన్‌కు అనుగుణంగా దిగుబడిని పొందుతున్నారు. ప్రైవేటు మార్కెట్‌లపై ఆధారపడకుండా తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. స్థానికంగా ప్రకృతి విధానంలో పండిన పండ్లకు కూరగాయలకు మంచి ఆదరణ లభిస్తోందని మార్కెట్ కన్నా కాస్త ఎక్కువ ధర ఉన్నా వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు అంజిరెడ్డి.

తన 20 ఎకరాల భూమిలో వివిధ రకాల ఉద్యాన పంటలను పండిస్తూనే పొలం గట్ల మీద శ్రీగంధం , ఎర్రచందనం, సీతాఫలం, అడవి మొక్కలను పెంచుతున్నారు. ఏడాది పొడవునా ప్రతి రోజు పంట వచ్చే విధంగా పొలాన్ని సిద్ధం చేసుకున్నారు. పంటలకు గణ, ద్రవ జీవామృతాలతో పాటు మట్టి ద్రావణాలను అందిస్తున్నారు. ఈ ప్రకృతి పద్ధతులను అనుసరించడం వల్ల పండ్ల తోటల్లోనే కాదు కూరగాయల సాగులోనూ సత్ఫలితాలు అందుతున్నాయని అంజిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మార్కెటింగ్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తులను ఎక్కడ విక్రయించుకోవాలి అన్న ప్రశ్న రైతుల్లో మెదులుతుంటుంది. అయితే మార్కెట్‌లపై ఆధారపడకుండా రైతే స్వయంగా పంటలను అమ్ముకోవాలని అంజిరెడ్డి సూచిస్తున్నారు. అందుకోసం రైతు తనను తాను సిద్ధం చేసుకోవాలంటున్నారు. తాను పండిస్తున్న పంటలకు స్థానికంగా మంచి గిరాకీ ఉందని ధర ఎక్కువైనా వినియోగాదారులు సేంద్రియ ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని సంబరపడుతున్నారు. ప్రకృతి విధానాలను పాటిస్తూ నేలతల్లిని కాపాడుతున్న రైతు అంజిరెడ్డి వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యం అంటున్నారు. తోటి రైతులు ప్రకృతి సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories