Organic Farming: నిత్యం దిగుబడి.. నికరమైన రాబడి

Organic Farming: నిత్యం దిగుబడి.. నికరమైన రాబడి
x

Organic Farming: నిత్యం దిగుబడి.. నికరమైన రాబడి

Highlights

Organic Farming: నిత్యం దిగుబడి, నికరమైన రాబడి, సేంద్రియ విధానంలో సేద్యం ఒకే క్షేత్రం అక్కడ కాసే పండ్ల రుచి అమోఘం.

Organic Farming: నిత్యం దిగుబడి, నికరమైన రాబడి, సేంద్రియ విధానంలో సేద్యం ఒకే క్షేత్రం అక్కడ కాసే పండ్ల రుచి అమోఘం. ఓ రైతు ఏడాది పొడవునా ఆదాయంతో పాటు ఆర్థిక భరోసాను ఎలా సాధించవచ్చో ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు వరంగల్ జిల్లా ఖాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన సింగారెడ్డి శౌరిరెడ్డి. తనకున్న ఐదున్నర ఎకరాల్లో హరితక్షేత్రాన్ని సృష్టించి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన 140 రకాల పండ్లు పండిస్తూ పొలంలో ప్రయోగాలకు పెద్దపీట వేశారు. గత తొమ్మిదేళ్లుగా సేద్యం చేస్తున్న ఈ రైతు అనేక జాతుల మొక్కలకు ప్రాణం పోశారు. ఏ సీజన్‌లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో తినాలనే తపన ఎప్పుడైనా పది రకాల పండ్లు ఇంట్లో ఉండాలనే కోరికే ఈ రైతును పండ్ల సాగువైపు నడిపించింది. తోటి వారికి స్ఫూర్తిగా నిలిచేలా చేసింది.

బాల వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సింగారెడ్డి శౌరిరెడ్డి ఈ సంస్థ ద్వారా ఎంతో మంది రైతులకు సేంద్రియ సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. కేవలం మైకులు పట్టుకుని రైతులకు పాఠాలు చెప్పడమే కాదు. తాను ప్రయోగాల సేద్యంచేస్తూ రైతులకు ఓ మార్గాన్ని చూపుతున్నారు. అందరిలా ఒకే రకమైన పంటను సాగు చేయకుండా సమగ్ర సేద్యం చేస్తున్నారు ఈ రైతు. మొదట తమ కుటుంబానికి సరిపడా పండ్లను పండించాలనుకున్న ఈ రైతు ఎకరం విస్తీర్ణంలో 16 రకాల పండ్ల మొక్కలను నాటారు. ఈ మొక్కలు పెరుగుతున్నా కొద్దీ సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వచ్చారు. ఇలా స్థానికంగా దొరికే రకాలతో పాటు దేశ విదేశాలకు చెందని పండ్ల రకాలను తన క్షేత్రంలో సాగు చేయడం మొదలు పెట్టారు.

రాంబూటాన్, లిచీ, పీనట్ బటర్, బిలింది, ఐస్‌క్రీమ్‌ బీన్, బరాభా, అంబరిల్లా, కుమ్‌క్వాట్ , నోని వంటి విదేశీ రకాలతో పాటు 9 రకాల సీతాఫలాలు, 9 రకాల జామ పండ్లు, మూడు రకాల సపోట, దురియన్, అవగాడో, రుద్రాక్ష మొక్కలు ఈ క్షేత్రంలో పెంచుతున్నారు ఈ సాగుదారు. పండ్లలో రారాజైన మామిడిలోనూ విభిన్న రకాలను ఈ రైతు పండిస్తున్నారు. సుమారు 26 రకాల మామిడి రుచులను ఇక్కడ చూడవచ్చు. ఇవి కాక ఐదు నుంచి ఆరు రకాల ఆల్ సీజన్ మామిడి రకాలను పండిస్తున్నారు. సాధారణ పద్ధతులతో పాటు సూపర్ హైడెన్సిటీ విధానాలను పాటిస్తున్నారు.

తనను చూసి తోటి రైతులు లాభసాటి సేద్యం వైపు అడుగులు వేయాలన్నది ఈ రైతు అసలు ఉద్దేశం. అందుకోసమే సమగ్ర సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు 140 రకాల పండ్లను పండిస్తూనే మరో వైపు తమ కుటుంబానికి అవసరం నిమిత్తం పావు ఎకరంలో వరి సాగు చేస్తున్నారు. వాటితో పాటే కూరగాయలు, వేరుశనగ, కంది వంటి పంటలు పండిస్తున్నారు. కుంటల్లో చేపలు, నాటుకోళ్లు, కుందేళ్లు ఇలా వివిధ రకాల జీవాలను పెంచుతున్నారు. సాగులో ఇంతటి వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు కాబట్టే రైతుల నుంచి విశేష ఆధరణ లభిస్తోంది.

ఒకప్పుడు సాగు నీరు లేక బీడువారిన నేల ఇది. బోర్లు వేసినా నీటి జాడ కనిపించలేదు. కానీ రైతు కృషి ఫలితంగా నేడు సమృద్ధిగా భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. వేసవిలోనూ మొక్కలకు సమయానుకూలంగా నీటిని అందించగలుగుతున్నారు. పొలం పోతుందని ఏ మాత్రం ఆలోచించకుండా పావు ఎకరం విస్తీర్ణంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నారు శౌరిరెడ్డి. పొలంలో పడిని ప్రతి నీటి చుక్కను సంరక్షిస్తూన్నారు. అంతే కాదు సమగ్ర సేద్యం విధానంలో భాగంగా కుంటలో 2వేల చేపలను పెంచుతున్నారు. వాటి ద్వారా లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. చిటికెడంత రసాయనాలను ఉపయోగించకుండా నూటికి నూరు శాతం సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. రైతులకు సేంద్రియ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories