Top
logo

భాగ్యనగరం నడిబొడ్డున ఉద్యాన పంటల సేద్యం

Seven Layer Method Cultivation BY SRACO Organization
X

భాగ్యనగరం నడిబొడ్డున ఉద్యాన పంటల సేద్యం

Highlights

SRACO Organization: విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చి దాన్ని అమ్మే వరకు రైతు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు.

SRACO Organization: విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చి దాన్ని అమ్మే వరకు రైతు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పెరుగుతున్న సాగు పెట్టుబడులతో ఏటా కర్షకులు నష్టాలను చవిచూస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించినా మార్కెట్‌లో మద్దతు ధర దక్కడం లేదు. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. చేసేదేమి లేక సేద్యం చేయలేక సాగుదారులు వలసపోతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితి నుంచి రైతును బయటకు రప్పించి తనకు తానే ఆదాయాన్ని సృష్టించుకునే మార్గం చూపించే ప్రయత్నం చేస్తోంది శ్రాకో స్వచ్ఛంద సంస్థ. డా. సునితా ప్రసాద్ ఆధ్వర్యంలో సేంద్రియ విధానంలో ఏడంచెల పద్ధతిని అనుసరిస్తూ ప్రయోగాత్మకంగా వివిధ రకాల ఉద్యాన పంటలు పండిస్తున్నారు సంస్థ నిర్వాహకులు. ఎకరా భూమిలో నాలుగు ఎకరాల పంట తీయగలిగిన విధానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు.

విత్తుబట్టే పంట అంటారు. మంచి దిగుబడి అందాలంటే నాణ్యమైన విత్తనం ఉండాలి. ఇది ఒకప్పటి మాట విత్తుతో పాటే పండించే భూమిలో సత్తువ ఉండాలన్నది నేటి వాస్తవం. హరిత విప్లవం కారణంగా పంటల సాగులో విపరీతమైన రసాయనాల వినియోగం పెరిగిపోయింది. తద్వారా వల్ల నేలలో ఉండే కోటానుకోట్ల వానపాములు, సూక్ష్మజీవులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. నేలలో కర్బనం శాతం తగ్గిపోతోంది. అందుకే నేలకు తిరిగి బంగారు పంటలు పండించే శక్తి రావాలంటే ప్రకృతి, సేంద్రియ విధానాలవైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిస్తున్నారు సంస్థ నిర్వాహకులు. రసాయనాలను తగ్గిస్తున్న తరుణంలో వాటికి ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఏడు రకాల ఫంగిసైట్స్ ఏడు రకాల బ్యాక్టీరియాలతో మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు.

గాలి, వెలుతురు, సూర్యరశ్మిని అర్దం చేసుకుని దానికి అనుగుణంగా పంటలు వేశారు. మొదటి లేయర్లలో అత్యంత పొడవైన మొక్కలు , తరువాత రెండో లేయర్లలో బొప్పాయి, అరటి, మునగ చెట్లు. ఆ తరువాత పూల మొక్కలు, దాని కింద టమోట, వంగ, బెండ వంటి కూరగాయలు ఆ తరువాత లేయర్లో ఆకుకూరలు, దాని తరువాత క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి వంటి పంటలు పండిస్తున్నారు. గుప్పెడు రసాయన మందులు వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలోనే పంటలు పండిస్తున్నారు.

ఈ ప్రయోగాల వ్యవసాయ క్షేత్రంలో అనువంత స్థలం కూడా వృధాగా పోనీయడం లేదు. ఫెన్సింగ్‌లను సైతం పంటల సాగుకు వినియోగిస్తున్నారు. తీగజాతి మొక్కలైన సొర, బీర, కాకర వంటి పంటలు పండిస్తున్నారు. చీడపీడలు వ్యాపించినా వాటిని సహజ పద్ధతుల్లోనే నివారిస్తున్నారు. వేప నూనె, పసుపునీరు, ల్యాబ్ ద్రావణం, బియ్యం కడిగిన నీరే వీరి పురుగు నివారణ అస్త్రాలు. మొక్కలు మరింత బలంగా ఎదిగి చక్కటి దిగుబడిని అందించేందుకు అజొల్లాను సైతం ఉత్పత్తి చేస్తున్నారు. అజొల్లాను మొక్కలకు ఇవ్వడం వల్ల సాగు ఖర్చులో 40 శాతం తగ్గించుకోవచ్చుని క్షేత్రం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సహజ, సేంద్రియ విధానాల వల్ల క్షేత్రంలో మిత్రపురుగుల సంఖ‌య పెరిగిందంటున్నారు.

వినియోగదారుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి ఒక్కరు సేంద్రియ ఆహారం దొరికితే బాగుంటుందని భావిస్తున్నారు. రైతులు సేంద్రియ సేద్యం చేసేందకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో రైతులను ప్రోత్సహించేందుకు ఈ ఏడంచెల విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా ఔత్సాహిక రైతులకు విత్తనాలు, నారును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

సేంద్రియ విధానంలో సరికొత్త పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పడేందుకు ఏడంచెల సాగు విధానంలో ఉద్యాన పంటలు పండిస్తూ తోటి రైతుల్లో స్ఫూర్తి నింపుతోంది శ్రాకో సంస్థ. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు పొందడంతో పాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను. వినియోగదారులకు అందిస్తూ ఆదాయం పొందే మార్గాలను సూచిస్తున్నారు. రైతులు ఈ నూతన విధానాలను అందిపుచ్చుకోవాలని ఆశిద్దాం.


Web TitleSeven Layer Method Cultivation BY SRACO Organization
Next Story