Balamitra Review: 'బాలమిత్ర' రివ్యూ

Balamitra Movie Review
x

బాలమిత్ర మూవీ పోస్టర్ 

Highlights

'బాలమిత్ర' రివ్యూ

రివ్యూ: 'బాలమిత్ర'

మూవీ నేమ్‌: 'బాలమిత్ర'

విడుదల తేది: 2021, ఫిబ్రవరి 26

నటీనటులు: రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు

సంగీతం: జయవర్ధన్,

సినిమాటోగ్రఫీ: రజిని,

ఎడిటర్: రవితేజ,

ఆర్ట్: భీమేష్,

నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,

కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ఈ మధ్య సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న జానర్‌. ఈ జానర్‌లో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ ఫిల్మ్‌ అనే అర్థం. ఈ జానర్‌కి స్క్రీన్‌ప్లే కనుక కరెక్ట్‌గా సెట్‌ అయితే.. బాక్సాఫీస్‌ షేకవ్వడం ఖాయం. మరి అలాంటి జానర్‌లోనే తెరకెక్కింది 'బాలమిత్ర' చిత్రం. టైటిల్‌ చూస్తే.. చిన్నప్పటి చందమామ కథలు గుర్తుకు వచ్చేలా ఉన్నా, టీజర్‌, టైలర్‌, ప్రోమోలలో మాత్రం ఇదొక ఆసక్తికరమైన కథతో తెరకెక్కినట్లుగా అనిపించింది. అలాగే టైటిల్‌ క్లాస్‌గా ఉందేమో కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుందని మేకర్స్‌ కూడా చెబుతూ వచ్చారు. మరి వారు చెప్పినట్లుగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఎటువంటి ఫీల్‌ ఇచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

మెడికల్‌ స్టూడెంట్‌ అయిన అర్జున్‌ (రంగా), తన క్లాస్‌మేట్‌ దీక్ష (కియా)ని ప్రేమిస్తాడు. ముందు ప్రేమని అంగీకరించకపోయినా.. అతని ప్రేమ నిజం అని తెలుసుకున్న దీక్ష.. అతనని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా దీక్ష కిడ్నాప్‌ అవుతుంది. కిడ్నాపర్లు అర్జున్‌కి ఫోన్‌ చేసి.. ముగ్గురిని చంపితేనే దీక్షని వదులుతామని బెదిరిస్తారు. వారు చెప్పినట్లే ఇద్దరిని చంపేసిన అర్జున్‌.. కొన్ని రోజులు కనిపించకుండా ఉండేందుకు బాల స్నేహితుడిగా ఓ గ్రామం వెళతాడు. అక్కడ బాల సోదరి వైశాలి.. అర్జున్‌ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అసలు దీక్ష కిడ్నాప్‌ ఎందుకు అవుతుంది? బాల ఎవరు? వైశాలి ఫ్యామిలీకి అర్జున్‌ చేసే హత్యలకు సంబంధం ఏమిటి? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే.. సస్పెన్స్‌తో నిండిన 'బాలమిత్ర' చిత్రం చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

హీరో అర్జున్‌ చూపులకు చాలా చక్కగా ఉన్నాడు. హీరో క్వాలిటీస్‌ అతనిలో బాగున్నాయి. కొన్ని సీన్లలో చాలా చక్కగా నటించాడు. అతనికిది రెండో చిత్రమే అయినా.. ఎక్కడా అలాంటి ఫీలింగ్‌ రానివ్వకుండా మెప్పించాడు. లవర్‌గానూ, అలాగే తనకి తెలియకుండా చేస్తున్న హత్యలకు కారణం ఏమిటో తెలుసుకునే అన్వేషిగా సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ని కనబరిచాడు. హీరోయిన్లలో కియా రెడ్డి గ్లామర్‌గా కాసేపు కనిపించింది. అలాగే కథలో మెయిన్‌ పాత్రధారిగా కూడా ఆమె నటన బాగుంది. బాల త్రిపుర సుందని పాత్రలో చేసిన అమ్మాయి క్యూట్‌గా సమాజం కోసం తాపత్రయపడే పాత్రలో ఒదిగిపోయింది. చిత్రానికి మెయిన్‌ ట్విస్ట్ ఇచ్చే వైశాలి పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది. అలాగే వైశాలిగా చేసిన అమ్మాయి పల్లెటూరి అమ్మాయిగా, పగబట్టిన నారిగా రెండు పాత్రలను అద్భుతంగా పోషించింది. మిగతా పాత్రల్లో హీరో ఫ్రెండ్స్‌ నవ్వించే ప్రయత్నం చేయగా.. తండ్రి పాత్రలో దయానందరెడ్డి చక్కటి నటనను కనబరిచారు. మిగతా పాత్రలన్నీ కథకు అనుగుణంగా నడిచాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకి సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా రెండు పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సంగీత దర్శకుడు మెప్పించాడు. వెళ్లిపోమాకే, తండ్రీ కూతుళ్ల బంధం తెలిపే సాంగ్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌, ఆర్ట్ వర్క్‌ ఓకే. సినిమా నిర్మాణం కూడా చాలా రిచ్‌గా ఉంది. కథను నమ్మి నిర్మాత ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే.. ఫస్టాఫ్‌ సోసో గా నడిపించినా.. సెకండాఫ్‌ మాత్రం ట్విస్ట్‌లతో దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాడు. సరైన క్లైమాక్స్‌తో చిత్రాన్ని ముగించాడు.

విశ్లేషణ:

సినిమా స్టార్టింగే.. దిశ ఘటన తరహా ఘటనతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్‌ పిల్లలతో కార్టూన్స్‌ స్టోరీ నడుస్తుండగా.. టైటిల్స్‌ పడుతుంటాయి. ఆ కార్టూన్స్‌ ప్లేని కరెక్ట్‌గా ఫాలో అయితే సినిమా స్టోరీ మొత్తం రివీలవుతుంది. దర్శకుడు తను చెప్పాలనుకున్న కథకి, సస్పెన్స్‌ జోడించి థ్రిల్లర్‌గా మార్చాడు. ఫస్టాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ల ప్రేమని హైలెట్‌ చేసి, సెకండాఫ్‌లో మెయిన్‌ కథని నడిపించాడు. ఎందుకు చంపుతున్నాడో తెలియని హీరోకి.. ఆ కారణం తెలియజేసే ట్విస్ట్‌ బాగుంది. అలాగే 'అతడు' తరహాలో హత్యలు చేసిన హీరో కొన్ని రోజులు కనిపించకుండా ఉండడానికి ఆ హత్యలకు కారణమైన ఫ్యామిలీ ఇంటిలోనే బస చేయడం కూడా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతీ పాత్రకి, ఆఖరి చిన్న బుడతడి పాత్రతో కూడా దర్శకుడు కామెడీ చేయించాడు. మనిషికి ఆశయమే కాదు.. దానికి తగిన ఆలోచన కూడా ఉండాలని, అది ఉన్నతంగా ఉండాలని దర్శకుడు చెప్పిన తీరు.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్‌ ఇదేం సినిమా అనుకున్న ప్రేక్షకుడు కూడా.. సెకండాప్‌కి వచ్చేసరికి తృప్తిగా బయటికి వస్తాడు. ఓవరాల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్‌ విషయం ఆడియన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories