Top
logo

Happy Holi 2021: హోలీ స్పెషల్.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా

Holi Celebrations
X

హోలీ 

Highlights

Happy Holi 2021: చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా హోలీ ఈ పండుగను జరుపుకుంటారు.

Happy Holi 2021: రంగుల హోలీ పండుగ వస్తుందంటే చాలు ముందు నుంచే అందరిలో ఉత్సాహం నెలకొంటుంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా హోలీ ఈ పండుగను జరుపుకుంటారు. హాలి రాగానే చాలు అందరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. హోలి ప్రత్యేకత ఏంటి? హోలి ఎందుకు వచ్చింది? హోలి విశిష్టత గురించి మనం తెలుసుకుందాం.

తెలుగు సంవత్సరాదిలో వచ్చే నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. పాల్గుణ మాసంలో వచ్చే ఫాల్గుణ పౌర్ణమిని మహా ఫాల్గుని, డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి.

ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మర్నాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు.

హిందూ పురాణాల్లో ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీ పర్వదినం ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి జోలపడతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. కృష్ణ భగవానున్ని ఊయల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్‌లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. పాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు.

పురాణ కథ:

ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

మరోక పురాణకథ చూస్తే.. హిందూ పురాణల ప్రకారం హోలి జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రహ్ణాదుడు మహావిష్ణువు భక్తుడు. ఆయన తండ్రి హిరణ్య కశ్యపుడు విష్ణువును వ్యతిరేకిస్తాడు. విష్ణువును ఆరాదించడం మానుకోవాలని ప్రహ్లాదుడుని హెచ్చరిస్తాడు. అయితే ప్రహ్లాదుడు తండ్రి మాట వినడు దీంతో హిరణ్య కశ్యపుడు కొడుకును చంపమని ఆదేశిస్తాడు. హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు.

అయితే శాస్త్రీయ కారణాల చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహామ్మారి విజృంభిస్తున్న తరుణంలో హోలిపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఈ పండగ జరుపుకోనేవారు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా కారణంతో గత సంవత్సరం ప్రజలు హోలికి పండుగ సంబరాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Web TitleImportance and Significance of ‌Holi Festival 2021
Next Story