Top
logo

Telangana: రెండు పార్టీలకు.. బీఎస్పీ భయం..

Telangana: రెండు పార్టీలకు.. బీఎస్పీ భయం..
X

Telangana: రెండు పార్టీలకు.. బీఎస్పీ భయం..

Highlights

Telangana: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ప్రధాన పార్టీలకు దడ పుట్టించబోతోందా?

Telangana: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ప్రధాన పార్టీలకు దడ పుట్టించబోతోందా? వచ్చే నెల మళ్లీ పట్టాల మీదకి ఎక్కబోతుందున్న ప్రచారం ప్రకంపనలు పుట్టిస్తోందా? దళిత, బహుజనులే లక్ష్యంగా రాబోతున్న ఆ పార్టీ ఏంటి? ఆ పార్టీ వస్తే తమకు నష్టమేమైనా కలుగొచ్చన్న ప్రాంతీయ, జాతీయ పార్టీల భయమేంటి? ఒకవేళ అదే జరుగుతుందని అనుకుంటే ఆ నష్టాన్ని పూడ్చడానికి తీసుకోబోతున్న చర్యలేంటి? రంగలోకి దిగిన పార్టీలు వేస్తున్న పాచికలేంటి రచిస్తున్న పథక రచన ఏంటి? మొన్నీ మధ్య పోలీస్‌బాస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ఖాకీ వస్త్రాలు వదిలి ఖద్దరు దుస్తులు ధరించబోతున్నారా? తెలంగాణలో రంగులు మారుతున్న రాజకీయాలేంటి?

తెలంగాణలో మరో జాతీయ పార్టీ కొత్తగా అడుగుపెట్టబోతుంది. పార్టీ ప్రారంభించకముందే ఆ పార్టీ తెలంగాణ రాజకీయాలల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షుడిగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో సరి కొత్తగా ఆరంభం కాబోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి మాయావతి తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజకీయాలు ఒక్కసారిగా రంగులు మారాయి. అదీగాక, వచ్చేనెల 8న బహుజన సమాజ్‌ పార్టీకి సంబంధించిన కార్యాచరణంతో పాటు, పార్టీ విధి విధానాలు ప్రకటించడానికి నల్గొండ వేదికగా సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

తెలంగాణలో బలపడటానికి తమకు సత్తా ఉందంటూ అందుకోసం యాక్షన్‌ ప్లాన్‌ స్టార్ట్ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ప్రకటన రాగానే రెండు జాతీయ పార్టీల్లో చిన్న పాటి కదలిక వచ్చిందంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీలు తమ ఓటు బ్యాంకును మాయావతి కొల్లగొట్టే ప్రమాదం ఉందన్న అంచనాతో బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్నాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీకి కొత్త చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రావడంతో, ఇక్కడ పుంజుకోవడానికి ఇదే మంచి సమయమని హస్తం పార్టీ భావిస్తున్న తరుణంలో కొత్తగా వచ్చిన ఈ ప్రకటన కాంగ్రెస్‌లో ఉన్న బహుజన నేతలను ఆలోచనల్లో పడేసిందట.

ఇప్పుడు దూకుడు పెంచి, దుందుడుకుగా వెళ్దామనుకున్న కాంగ్రెస్‌కు దళిత ఓటుబ్యాంకు సహజ సిద్ధంగా బాగానే ఉంటుంది. కానీ బీఎస్పీ వస్తే దాన్ని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద పనిగా చెప్పుకుంటోంది క్యాడర్‌. కొత్తగా రాబోతుందని ప్రచారంలో ఉన్న బహుజన సమాజ్‌ పార్టీ వైపు దళిత ఓటు బ్యాంక్‌ గనుక మళ్లితే కాంగ్రెస్ ఓట బ్యాంకు‌కు గండిపడే అవకాశం ఉందని గాంధీభవన్‌ మాట్లాడుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే దళిత బహుజన ఓటు బ్యాంక్ టార్గెట్‌గా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సారథ్యంలో బీఎస్పీ గనుక వస్తే ఓటుబ్యాంకు కొల్లగొట్టే ప్రమాదం ఉందని హస్తం పార్టీ అంచనా వేసుకుంటుందట.

ఇక బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ కూడా రాబోయే బీఎస్పీ వల్ల జరిగే నష్టాన్ని కూడా ముందుగానే అంచనా వేస్తోందట. ఇప్పటికే పార్టీ పాత సారథి లక్ష్మణ్‌కు జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చి తాము కూడా బీసీ పక్షపాతమేనని చెప్పే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. కానీ తాజాగా త్వరలో రాబోతున్న బీఎస్పీ వల్ల బీజేపీ ఓటు బ్యాంకుకు కూడా గండిపడే ప్రమాదం ఉందని కమలనాథులు కలవరపడుతున్నారట. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే గనుక, దాన్ని క్యాష్‌ చేసుకుందామని భావిస్తూ పోటీ పడి మరి దూసుకెళ్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ వల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నాయట. రాబోయే బీఎస్పీ దళిత, బహుజన ఓటర్లే టార్గెట్‌గా వస్తుండడంతో ఎవరి అవకాశాలను కొల్లగొడుతుందని రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

అయితే, ఒకవేళ బీఎస్పీ గనుక ఫామ్‌లోకి వస్తే ఆ పార్టీ నుంచి జరుగబోయే నష్టాన్ని భర్తీ చేయడానికి రెండు జాతీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రావీకుమార్ సారథ్యంలో రాబోతున్న పార్టీ ఎంతో కొంత బలపడొచ్చని, బీసీ నినాదంతో బీఎస్పీ దళిత, బహుజనులకు ప్రాధాన్యం కల్పించవచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మరి ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సారథ్యలో బీఎస్పీ ఎలా పరుగులు పెడుతుందో చూడాలి.

Web TitleTwo Parties Scared of BSP in Telangana
Next Story