విజ్ఞాన కేంద్రంగా మారిన నారాయణపేట్ జిల్లా రైతు వేదిక

Attractive Model Farming System in Narayanpet
x

విజ్ఞాన కేంద్రంగా మారిన నారాయణపేట్ జిల్లా రైతు వేదిక

Highlights

విజ్ఞాన కేంద్రంగా మారిన నారాయణపేట్ జిల్లా రైతు వేదిక

Model Farming: అయితే వరి, లేదా పత్తి ఈ సంప్రదాయ పంటల సాగులో పడి రైతులు సేద్యంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు ఖర్చులు పెరగడం, చీడపీడలు అధికమవడంతో పాటు మార్కెట్‌లో గిట్టుబాటు లేక సేద్యం రైతుకు భారంగా మారుతోంది. వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మూసధోరణిలో వరి సాగుకే సమాయత్తమవుతున్నారు. ఈక్రమంలో నారాయణపేట జిల్లా వ్యవసాయాధికారులు ముందడుగు వేసి ఆర్ధికాభివృద్ధి సాధించే సాగుపై రైతలకు చైతన్యం కల్పిస్తున్నారు. రైతు వేదిక కేంద్రంగా మోడల్ ఫామ్‌ను ఏర్పాటు చేసి తక్కువ విస్తీర్ణంలో విభిన్న పంటలు పండిస్తూ రైతులను ఆలోచింపజేస్తున్నారు. పది గుంటల స్థలంలో 20 రకాల పంటలు పండించి నెలలో 30 వేల రూపాయల వరకు రైతు సంపాదించే అవకాశం ఉందని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. సన్న చిన్నకారు రైతుల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ మోడల్ ఫామ్‌ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది.

ఈ మోడల్ ఫామ్‌ను ఈస్ట్ వెస్ట్ సీడ్ కంపెనీ ప్రతినిధులు అత్యాధునిక పద్ధతులను మేళవించి రైతులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దింది. సుమారు 37 రకాల కూరగాయలను ఈ కొద్దిపాటి స్థలంలో పండించేలా మోడల్ ఫామ్‌ను నిర్మించారు. తీగజాతి, పొదజాతి, దుంపజీతులు, ఆకుకూరలకు సాగుకు అనువుగా వాతావరణాన్ని కల్పించారు. అందుకు అవసరమైన నూతన సాగు పద్ధతులను ప్రవేశపెట్టారు. జిల్లాలో అధికమొత్తంలో ఉన్న వరి సాగును తగ్గించి రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ డెమో ఫామ్ ద్వారా రైతులకు ఎదురయ్యే అనేక సందేహాలను నివృత్తి చేస్తున్నామన్నారు. రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

ఈ మోడల్ ప్రాజెక్టులో మల్టీ క్రాపింగ్ పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంది. రైతులు ఈ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా డీఆర్‌డీఓ అధికారి తెలిపారు. తక్కువ నీటితో, తక్కువ స్థలంలో, తక్కువ సమయంలో 20 రకాల పంటలను పండించే విధంగా తీర్చిదిద్దిన ఈ మోడల్ ఫామ్‌ ఎంతో సృజనాత్మకంగా ఉందని అన్నారు. తన స్థాయిలో ఈ మోడల్ ఫామ్‌పై మహిళలకు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. తాను ఈ ప్రయోగాల సేద్యానికి శ్రీకారం చుడతానని పేర్కొన్నారు.

ఈ ప్రయోగాత్మక సేద్యం తమను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు జిల్లా రైతులు. ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమను కొద్దిపాటి స్థలంలో ఎక్కువ మొత్తంలో పంటలు పండించవచ్చు అన్న విధానం అమితంగా ఆకర్షించిందని చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేద్యంలోనూ అనేక మార్పులు వచ్చాయిని వాటికి అనుగుణంగా తాము వ్యవసాయంలో మార్పులను తీసుకువస్తామని తెలిపారు. పది గుంటల భూమిలో ఇన్ని రకాల పంటలు ఎలా పండించాలి? ఏ విధానాలను అవలంభించాలన్న విషయాలను రైతులు అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సాగు విస్తీర్ణం తగ్గడం, ఖర్చులు పెరగటం, కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నూతన విధానం చిన్నసన్నకారు రైతులకు వరంగా మారుతుందని రైతలు చెబుతున్నారు. వరి, వేరుశనగ, పత్తి పంటలతోనే కాకుండా ఈ కూరగాయల సాగుతోనూ రైతు ఆర్ధిక స్వావలంభన సాధించవచ్చని ఈ విధానం రుజువుచేస్తుందని అన్నారు. ఇలాంటి ఆధునిక పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్న వ్యవసాయాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రయోగాత్మక మోడల్ ఫామ్ చిన్నసన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. మరి నష్టాలను మిగిల్చే కష్టాల సాగును పక్కన పెట్టి లాభాలను అందించే ప్రయోగాల సేద్యానికి రైతులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాము.


Show Full Article
Print Article
Next Story
More Stories