Coronavirus: సిక్కోలు అరటి రైతుకు తీరని నష్టం మిగిల్చిన కరోనా

Coronavirus Effect on Banana Farmers in Srikakulam
x

Coronavirus: సిక్కోలు అరటి రైతుకు తీరని నష్టం మిగిల్చిన కరోనా

Highlights

Coronavirus: ఓ వైపు తుఫాన్‌లు.. మరోవైపు కరోనా మహమ్మారి.

Coronavirus: ఓ వైపు తుఫాన్‌లు.. మరోవైపు కరోనా మహమ్మారి. ఈ రెండు విపత్తులు అన్నదాతకు కన్నీళ్లను మిగిల్చాయి. ఇవాళ కాకుంటే రేపైనా బతుకు బావుంటుందని ఆశించిన రైతుకు మళ్లీ, మళ్లీ నిరాశే ఎదురవుతోంది. వరి కలిసిరాలేదని అరటివైపు మొగ్గు చూపిన సిక్కోలు కర్షకుడికి ఈసారి కరోనా నష్టాలను, కష్టాలనే మిగిల్చింది. సిక్కోలు అరటి రైతుల దీన పరిస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

కరోనా కల్లోలం వేళ లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. కరోనా పరిస్థితుల్లో శుభకార్యాలు లేక అరటి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. గతేడాది వరి పంటను తుఫాన్‌ తుడిచిపెట్టేసిన నేపధ్యంలో అరటి పంటనే నమ్ముకున్న సిక్కోలు రైతులు ఈ ఏడాది కరోనాతో మళ్లీ దుబ్బతిన్నారు.

సిక్కోలు జిల్లావ్యాప్తంగా 37వేల హెక్టార్లలో రైతన్నలు అరటి పంట సాగు చేశారు. ముఖ్యంగా రణస్థలం, లావేరు, పాలకండ, వీరఘట్టం, ఎచ్చెర్ల, పొందూరు, గార, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట మండలాల్లో అధికంగా అరటి సాగు చేశారు. అయితే, పంటపై బోలెడు ఆశలు పెట్టుకున్న రైతులను కరోనా సెకండ్ వేవ్ నిండా ముంచేసింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో మార్కెట్, రవాణా సదుపాయం లేక ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇలా ప్రతీ అంశం అరటి రైతుకు ప్రతికూలంగా మారింది.

దీనికి తోడు ఎలాంటి శుభకార్యాలు లేక స్థానికంగా అరటి మార్కెట్లు పూర్తిగా కుదేలయ్యాయి. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో గెల దాదాపు 400 పలకిన ధర ప్రస్తుతం 50 నుంచి 100 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. దీంతో సిక్కోలు అన్నదాత దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు.

మరోవైపు మొదటి వేవ్‌లో నష్టాలను చూసిన రైతులు ఈ ఏడాది టిష్యూ రకం ద్వారా లాభాలు పొందాలనుకున్నారు. అయితే, టిష్యూ రకం అరటికి ఎకరాకు లక్షల నుంచి లక్షన్నర వరకూ ఖర్చు చేశారు. ఇంత పెట్టుబడి పెట్టినా కరోనా కారణంగా కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా పరిస్థితుల్లో వ్యాపారులు అరటిని కొనేందుకు ముందుకు రావట్లేదు. దీనికితోడు మే నెలలో వచ్చిన తుఫాన్‌ దెబ్బ కూడా అరటితోటలపై భారీగా పడింది. అటు ఉద్యానవన పంటల్లో ఈ పంటకు బీమా సౌకర్యం లేకపోవడం జిల్లా రైతులను మరింత కుంగదీస్తుంది. చేతికందిన పంట శ్రీకాకుళం మార్కెట్ వరకూ చేరినా చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదని వాపోతున్నారు.

కరోనా లేకుంటే సిక్కోలు నుంచి విశాఖ, ఒడిశా, విజయనగరం సహా పలు ప్రాంతాలకు అరటి ట్రాన్స్ పోర్ట్ జరుగుతంది. ప్రస్తుత కర్ఫ్యూ పరిస్థితుల్లో ట్రాన్స్ పోర్ట్ లేక తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సిక్కోలు రైతులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories