సోలో పైలట్‌తో విమానం నడపడం సాధ్యమా.. పైలట్‌కు అనుకోకుండా ఏమైనా జరిగితే ఎలా?

40 Countries try to Move Towards one-pilot Flights
x

సోలో పైలట్‌తో విమానం నడపడం సాధ్యమా.. పైలట్‌కు అనుకోకుండా ఏమైనా జరిగితే ఎలా?

Highlights

సోలో పైలట్‌తో విమానం నడపడం సాధ్యమా.. పైలట్‌కు అనుకోకుండా ఏమైనా జరిగితే ఎలా?

Airlines: మీరు విమానంలో ఉన్నట్లయితే.. ఫైలట్‌ ముందుగా అభినందనలతో పాటు ప్రమాణ వివరాలను తెలుపుతాడు. అంతకుముందు విమాన సిబ్బంది.. ఫైలెట్లను పరిచయం చేస్తారు. ఆన్‌బోర్డ్‌లో సింగిల్‌ పైలట్‌ ఉన్నట్టు ప్రకటిస్తారు. విమానంలో ఇద్దరు పైలట్‌లు ఉంటారు కదా.. సింగిల్‌ పైలట్‌ ఏమిటని ఆశ్చర్యం కలుగుతుందా? అయితే త్వరలోనే విమానాలు సింగిల్‌ పైలట్‌తోనే గాల్లోకి ఎగరనున్నాయి. కేవలం కెప్టెన్‌ మాత్రమే ఉండనున్నారు. కాక్‌పిట్‌లో ఇక నుంచి కోపైలట్‌ ఉండరు. మరి.. ఒక పైలెటే ఉంటే... అనుకోకుండా ఎమైనా జరిగితే?.. పైలట్‌కు అత్యవసరం కలిగితే?.. వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తాయని ఆందోళన కలుగుతోంది కదూ.. ఒక పైలట్‌తోనే విమానాలను నడపాలని 40 దేశాలకు చెందిన పలు ఎయిర్‌లైన్‌ సంస్థలు అడుగులు వేస్తున్నాయి.

విమానాల్లో ఆన్‌బోర్డుపై ఇద్దరు పైలట్‌లు ఉంటారు. విమానంలో కెప్టెన్‌ నాయకత్వం వహిస్తారు. కోపైలట్‌ సహాయకారిగా ఉంటారు. కెప్టెన్‌కు ఉన్నట్టుండి ఏదైనా జరిగినా అత్యవసరాలను తీర్చుకునేందుకు వెళ్లిన కోపైలట్‌ విమానాన్ని సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటారు. అయితే 40పైగా దేశాలు సింగిల్‌ పైలట్‌తో విమానాలను నడిపేందుకు సిద్ధమయ్యాయి. అందుకు అనుమతి ఇవ్వాలని ఐక్యరాజ్య సమితిలోని అంతర్జాతీయ సివిల్‌ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌-ICAOను కోరాయి. కో పైలట్లు లేకుండా నడపాలని జర్మనీ, బ్రిటన్‌, న్యూజీలాండ్‌తో పాటు యూరోపియన్‌ యూనియన్‌ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీలు సింగిల్‌ పైల‌‌ట్‌తో నడిపే విమానాలకు మొగ్గు చూపుతున్నాయి. మరో ఐదేళ్లలో అంటే.. 2027 నాటికి పూర్తిగా సింగిల్‌ పైలట్‌ విమానాలను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. సోలో పైలట్‌ కోసం దేశాలు, ఎయిర్‌లైన్ సంస్థలు ఎందుకు యత్నిస్తున్నాయో అర్థం చేసుకోవడం అదేమంత పెద్ద కష్టం కాదు. వ్యయాన్ని తగ్గించుకోవడం ఇద్దరు పెలట్లకు చెల్లిండం భారంగా మారుతోందని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి. ఇది కాకుండా నిజానికి విమానయాన సంస్థలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కూడా సోలో పైలట్‌ విధానం వైపు ఎయిర్‌లైన్స్‌ మొగ్గు చూపడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

విమానయానం మొదలైన తరువాత.. 1900 మధ్య నుంచి కాక్‌పిట్‌ విధానం అమలవుతోంది. మొదట్లో కనీసం ఐదుగురు పైలట్లు ఉండేవారు. కెప్టెన్‌, కో పైలెట్‌, రేడియో ఆపరేటర్‌, నావిగేటర్‌తో పాటు ఫ్లైట్‌ ఇంజినీర్‌ ఆన్‌బోర్డుపై ఉండేవారు. ఇది కాలక్రమంలో మారిపోయింది. ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే పైలట్లు ఉంటున్నారు. కెప్టెన్‌తో పాటు ఓ కోపైలట్‌ ఆన్‌బోర్డుపై ఉంటారు. సాంకేతికంగా విమాన తయారీలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. దీంతో రేడియో ఆపరేటర్, నావిగేటర్‌, ఫ్లైట్‌ ఇంజినీర్ల అవసరం లేకుండాపోయింది. ఇప్పుడు కోపైలట్‌ను కూడా తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని ఎయిర్‌లైన్‌ సంస్థలు వాదిస్తున్నాయి. ఇప్పటికే పలు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సింగిల్‌ పైలట్‌తో నడుస్తున్న విషయాన్ని విమానయాన సంస్థలు గుర్తు చేస్తున్నాయి. ఫైటర్‌ జెట్లలాగే.. పౌర విమానాలను కూడా సింగిల్‌ పైలట్‌ నడిపేలా ఏర్పాట్లు ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్‌ వాదనలు బాగానే ఉన్నా.. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? అంటూ పలువురు కౌంటర్‌ వేస్తున్నారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సోలో పైలట్‌కు సహకరిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కోపైలట్‌ ఉంటే.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను సమన్వయం చేస్తారు. టేకాఫ్‌, ఎగిరే సమయంలో భద్రతను పర్యవేక్షిస్తారు. కెప్టెన్‌ ఏమైనా మరచిపోయినా.. ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. కోపైలట్‌ సహకరిస్తాడు. కోపైలట్‌ పనులన్నింటినీ కంప్యూటర్లు చేయగలవా? అంటే నో అనే సమాధానం వస్తోంది.

కోపైలట్‌ స్థానంలో కంప్యూటర్లు పని చేయలేవు. సాధ్యమైనంతవరకు విమానాలు ఆటోపైలట్‌ మోడ్‌లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. కానీ.. క్లిష్టమైన బిట్స్‌ను పైలట్లు మాత్రమే హ్యాండిల్‌ చేయగలరు. ఒకవేళ సోలో పైలట్‌ ఉంటే విమానం టేకాఫ్‌ సమయంలో అనుకోకుండా అస్వస్థతకు గరైతే ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి సమయాలు కోపైలట్‌ తప్పనిసరనే అవసరాన్ని గుర్తుచేస్తాయి. కేవలం ఒకరి చేతిలోనే లైఫ్‌ అండ్‌ డెత్‌ ఉంటుంది. కోపైలట్‌ ఉంటే కాక్‌పిట్‌ కూడా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు. పని భారాన్ని కూడా ఇద్దరూ పంచుకుంటారు. ఒకవేళ సోలో పైలటే ఉంటే ఏదైనా దారుణానికి ఒడిగడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు భయాన్ని కలిగిస్తున్నాయి. 2015లో జర్మన్‌ వింగ్ విమానం ప్రమాదమే అందుకు ఉదాహరణ. బార్సిలోనా నుంచి డస్సోల్డార్ఫ్‌కు బయలుదేరిన జర్మన్‌ వింగ్‌ ఫ్లైట్‌ 9525.. 144 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానంలో ఇద్దరు పైలట్లలో ఆండ్రియాస్‌ లుబిజ్‌ ఒకరు. కెప్టెన్‌ బయటకు వెళ్లగానే లుబిజ్‌ కాక్‌పిట్‌ డోర్‌ను మూసేశాడు. విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్‌ పర్వతాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఆర్తనాదాలు, హాహాకారాలతో హోరెత్తించింది. 150 మంది ప్రాణాలు కోల్పోయి. ఈ ఘటన ప్రపంచాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. పైలట్‌ తీరు దారుణంగా మారితే ఎలా ఉంటుందనేది ఈ ఘటనే చెబుతోంది. అదే సింగిల్‌ పైలట్లు అయితే మరింత ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ సింగిల్‌ పైలట్‌లు ఫ్లైట్‌ను నడిపే టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం పౌర విమానాలకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కానీ ఇటీవల తరచూ బోయింగ్‌ విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోయింగ్‌ విమానాలంటేనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బోయింగ్‌ తయారు చేస్తున్న సింగిల్‌ పైలట్‌ విమానాలపై భద్రత విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోలో విమానాలను నడపాలని కోరుకుంటున్న విమానయాన సంస్థల్లో చైనాకు చెందిన ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా ఉంది. ఇది చైనాలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌. పైలట్ల శిక్షణ, పారితోషికం ఆ సంస్థకు తడిసిమోపెడవుతోది. ఈ నేపథ్యంలో సింగిల్‌ పైలట్‌ విమానాల తయారీపై దృష్టి సారించింది. ఆమేరకు పరిశోధనలను ప్రారంభించింది. కాక్‌పిట్‌లోని పలు విభాగాలను మార్పులు చేయాల్సి ఉంటుందని సదరు సంస్థ పేర్కొంటోంది. బయట ఉన్న స్టాఫ్‌తోనే ల్యాండింగ్‌, టేకాఫ్‌ నిర్వహించే దిశగా ప్రయోగాలను చేస్తోంది. అయితే చైనా విమాన సంస్థపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భారీ ప్రమాదానికి గురైంది. విమానాల్లో భద్రతే అత్యంత ప్రధానమైనది. విమానయాన సంస్థలు, దేశాలు లాభాపేక్షను చూడకుండా భద్రతపైనే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐక్యరాజ్య సమితిలోని ఏవియేషన్ స్టాండర్డ్‌ అథారిటీ కూడా ఈ విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. సోలో పైలట్‌ విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories