కేంద్రం, రైతు సంఘాల మధ్య 11వ విడత చర్చలు

Farmers protest in Delhi
x

రైతుల నిరసన (ఫైల్ ఫోటో)

Highlights

* ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన * అన్నదాతల నినాదాలతో దద్దరిల్లుతున్న ఢిల్లీ శివార్లు * ఏడాదిన్నరపాటు చట్టాల అమలు నిలుపుతామంటున్న కేంద్రం * ఇవాళ తమ నిర్ణయాన్ని కేంద్రానికి వివరించనున్న రైతు సంఘాలు

అన్నదాతల నినాదాలతో ఢిల్లీ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. కేంద్రం ఎన్ని సవరణలు చేసినా.. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నూతన సాగు చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు రైతు సంఘాల ప్రతినిధులు చర్చించుకున్న అనంతరం సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది.

నూతన చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంబన తొలగించడానికి విజ్నాన్‌భవన్‌లో పలు విడతలు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలుపుదల చేస్తామని కేంద్ర సర్కార్‌ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే వివాదస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనను విరమించమంటున్నారు రైతులు. అటు సవరణలను ఒప్పుకుంటాం తప్ప చట్టాలను రద్దు చేయమంటూ కేంద్రం స్పస్టం చేస్తోంది.

ఇదిలా ఉండగా.., సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌ రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే వ్యవసాయ చట్టాలకు సభ్యులు సానుకూలంగా ఉన్నారని.. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌ను రైతులు తిరస్కరించారు. అంతేకాదు చట్టాలను రద్దు చేయడం, పంటలకు కనీస మద్దతు ధర తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు. అయితే చట్టాల రద్దు మినహా దేనికైనా అంగీకారమేనని స్పష్టం చేసింది కేంద్రం.

ఇక ఇప్పటివరకు కేంద్రం.. రైతు సంఘాలతో 10 సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ 10 సమావేశాల్లో సమస్యకు అసలు పరిష్కారమే దొరకలేదు. అటు ఏడాదిన్నర పాటు చట్టాలను అమలు చేయమని రైతు సంఘాల ముందు కేంద్రం ప్రతిపాదన పెట్టింది. అయితే ఈ విషయంపై తాము చర్చించుకుని నిర్ణయం చెబుతామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రైతు సంఘాలతో కేంద్రం 11వ సారి సమావేశం కానుంది. మరి ఈ చర్చలోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories