లండన్‌లో హర్షిత హత్య... విదేశాంగ శాఖ పట్టించుకోవడం లేదని హై కోర్టుకు వెళ్లిన కుటుంబం

Harshita Brella, Delhi woman killed by husband Pankaj Lamba in London after months of Dowry harassment and domestic abuse, family moves Delhi high court for justice
x

లండన్‌లో భారతీయురాలి హత్య... విదేశాంగ శాఖ పట్టించుకోవడం లేదని హై కోర్టుకు వెళ్లిన కుటుంబం

Highlights

Harshita Brella killed by husband in London: గతేడాది నవంబర్‌లో లండన్‌లో హర్షిత బ్రెల్లా అనే భారతీయ యువతి లండన్‌లో హత్యకు గురయ్యారు. నవంబర్ 14న...

Harshita Brella killed by husband in London: గతేడాది నవంబర్‌లో లండన్‌లో హర్షిత బ్రెల్లా అనే భారతీయ యువతి లండన్‌లో హత్యకు గురయ్యారు. నవంబర్ 14న ఇల్ఫోర్డ్‌లో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాక్స్‌హాల్ కోర్సా కారు డిక్కీలో ఆమె శవం కనిపించింది. ఆ తరువాతే ఆమె హత్యకు గురైన విషయం వెలుగులోకొచ్చింది. అంతకంటే నాలుగు రోజులు ముందే.. అంటే నవంబర్ 10 తేదీనే ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని లండన్ పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పటి నుండే ఆమె భర్త పంకజ్ కనిపించడం లేదు. పైగా పంకజ్ వరకట్నం కోసం వేధిస్తున్నట్లుగా లండన్‌లో పోలీసు కేసు నమోదైంది.

అల్లుడు పంకజ్ వేధిస్తున్నాడని తెలుసుకున్న ఢిల్లీలో ఉన్న హర్షిత కుటుంబం కూడా ఆమెను ఇండియాకు తిరిగి వచ్చేయమని చెప్పారు. కానీ అప్పటికే లండన్‌లో పంకజ్‌పై గృహహింస కేసు దర్యాప్తులో ఉన్నందున తను రాలేనని హర్షిత తన తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తరువాతే ఈ హత్య జరిగింది. ప్రస్తుతం లండన్ పోలీసులు పంకజ్ కోసం గాలిస్తున్నారు.

అయితే, ఈ ఘటన నెలలు గడుస్తున్నా పంకజ్ ఆచూకీ తెలియడం లేదు, లండన్‌లో కేసు విచారణ ముందుకు సాగడం లేదని హర్షిత సోదరి సోనియా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై ఆమె ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హర్షిత మర్డర్ కేసు దర్యాప్తులో విదేశాంగ శాఖ చొరవ తీసుకునేలా ఆదేశించాల్సిందిగా ఆమె కోర్టును కోరారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్టు.... కేసు విచారణ కోసం నోడల్ అధికారిని నియమించాల్సిందిగా విదేశాంగ శాఖను ఆదేశించింది.

సదరు నోడల్ అధికారి లండన్‌లోని పోలీసులు, ఇతర దర్యాప్తు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఆ సమాచారాన్ని సోనియాతో పంచుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విదేశాంగ శాఖకు ఇచ్చిన ఆదేశాల్లో కోర్టు స్పష్టంచేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

పంకజ్ కుటుంబం మద్దతుతోనే హర్షిత హత్య?

హర్షితను పంకజ్ హత్య చేయడంలో ఆయన తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని హర్షిత తండ్రి సత్బీర్ సింగ్ ఆరోపిస్తున్నారు. "హర్షిత హత్యకు గురైందని తమకు లండన్ ఇంటర్ పోల్ అధికారుల ద్వారా సమాచారం అందింది. హర్షిత హత్యకు గురైందని తెలిసినప్పుడు పంకజ్ తల్లిదండ్రులు మమ్మల్ని పరామర్శించేందుకు రాలేదు. కనీసం హర్షిత అంత్యక్రియలకు కూడా రాలేదు. అంతేకాదు... హర్షిత హత్యకు గురైనప్పటి నుండే పంకజ్ కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ వారి కుటుంబం మాత్రం పంకజ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయలేదు. ఇవన్నీ చూస్తోంటే హర్షిత హత్యలో పంకజ్ తల్లిదండ్రుల పాత్ర ఉందని స్పష్టంగా అర్థమవుతోంది" అని సత్బీర్ సింగ్ చెప్పారు.

"ఒకవేళ పంకజ్ నిజంగానే మిస్ అయి ఉంటే ఆయన తల్లిదండ్రులు కూడా ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండే వారు కదా" అని సత్బీర్ సింగ్ అనుమానం వ్యక్తంచేశారు.

నా సోదరి చిన్నపిల్లలంత అమాయకురాలు - సోనియా

"నా సోదరి హర్షిత చిన్న పిల్లలంత అమాయకురాలు. ఎదుటివారికి మనం మేలు చేస్తే వారు కూడా మనకు మేలు చేస్తారని బలంగా నమ్ముతుంది. అందరితోనూ అంతే అమాయకంగా ఉంటుంది. అలాంటి హర్షితను పంకజ్ పొట్టనపెట్టుకున్నాడు. అతడికి కఠిన శిక్ష పడాలి" అని హర్షిత సోదరి సోనియా డిమాండ్ చేస్తున్నారు.

పంకజ్ ఉద్యోగం విషయంలోనూ అబద్దం

"లండన్‌లో పంకజ్ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడని నమ్మించారు. కానీ అక్కడ అతను సెక్యురిటీ గార్డుగా ఉద్యోగం చేసేవాడని పెళ్లయ్యాకే తెలిసింది. ఆ ఉద్యోగం కూడా పోవడంతో ఏదో ఒక సంస్థలో డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడని ఆ తరువాతే తెలిసింది" అని సోనియా తెలిపారు.

పెళ్లయిన 9 నెలల్లోనే అంతా

గత సంవత్సరం మార్చి 21న హర్షిత పెళ్లి జరిగింది. కొన్ని రోజులకే పంకజ్ లండన్ వెళ్లిపోయారు. మరో నెల రోజులకు హర్షిత కూడా లండన్ వెళ్లారు. నవంబర్ 10న హర్షిత హత్య జరిగింది. అక్కడికి వెళ్లిన తరువాత ఆ 8 నెలలు పంకజ్ చేతిలో హర్షిత నరకం చూసిందని ఆమె కుటుంబం కన్నీటి పర్యంతమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories