ఉద్యోగి, సంస్థ ప్రతి నెలా జమ చేసే మొత్తానికి వడ్డీ కలుస్తూ ఈపీఎఫ్ నిధి పెరుగుతుంది. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే దీర్ఘకాలిక పెట్టుబడి.
అవసరానికి డబ్బు తీసుకోవచ్చా.?
ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక అవసరాలకు ఖాతాలోని సొమ్ములో కొంత భాగాన్ని ముందుగానే పొందవచ్చు. ఇందుకు నిర్దిష్ట అర్హతలు, పరిమితులు ఉంటాయి.
వడ్డీ చెల్లించే బాధ్యత ఉండదు
ఈపీఎఫ్ నుంచి నిబంధనల ప్రకారం ఉపసంహరించుకున్న డబ్బును తిరిగి వాయిదాల్లో చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యక్తిగత రుణంలా వడ్డీ భారం కూడా పడదు.
భవిష్యత్తు నిధిపై ప్రభావం
ఈపీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడం వల్ల ఆ మొత్తంపై భవిష్యత్తులో లభించే వడ్డీ ప్రయోజనం తగ్గుతుంది. పదవీ విరమణకు ఇంకా చాలా ఏళ్లు ఉన్నవారికి దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.
వ్యక్తిగత రుణంతో ప్రయోజనం
ఈపీఎఫ్ పొదుపును అలాగే ఉంచుకోవాలనుకునేవారు పర్సనల్ లోన్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. దీనివల్ల రిటైర్మెంట్ నిధి కొనసాగుతుంది. అయితే తీసుకున్న అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి.
ఈఎంఐ భారం ఎంతుంటుంది.?
వ్యక్తిగత రుణం తీసుకునే ముందు నెలవారీ ఆదాయం, ఇంటి ఖర్చులు, ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలను పరిశీలించాలి. కొత్త వాయిదా వల్ల కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.
రుణ ఆఫర్లను పోల్చి చూడండి
ఒకే బ్యాంకు ఆఫర్‌కు పరిమితం కాకుండా రెండు మూడు ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లు పరిశీలించాలి. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించాలి.
అత్యవసర నిధి ఉంటే ఉపయోగించుకోండి
తక్కువ మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ముందుగా అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ ఫండ్‌ను వినియోగించడం మంచిది. దీనివల్ల ఈపీఎఫ్ పొదుపుకు కోత పడదు, కొత్త అప్పు చేయాల్సిన అవసరమూ ఉండదు.
అప్పులున్నప్పుడు జాగ్రత్త
ఇప్పటికే ఇతర రుణాలు కొనసాగుతున్నట్లయితే మరో వ్యక్తిగత రుణం తీసుకోవడం ఆర్థిక ఇబ్బందులకు దారితీయొచ్చు. అలాంటి సమయంలో తక్కువ ఖర్చుతో డబ్బు సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలి.
డబ్బు తీసుకుంటే మళ్లీ పొదుపు చేయండి
అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుంచి సొమ్ము ఉపసంహరించుకున్నా, ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా అదనపు పొదుపు చేయొచ్చు. తద్వారా భవిష్యత్తు రిటైర్మెంట్ నిధిని బలోపేతం చేసుకోవచ్చు.