సేవింగ్స్ అకౌంట్‌పై నిఘా

ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలకు మించి నగదు డిపాజిట్ అయితే బ్యాంకు ఆ వివరాలను ఐటీ శాఖకు నివేదిస్తుంది. ఆ మొత్తానికి సరైన ఆదాయ ఆధారం లేకపోతే వివరణ ఇవ్వాల్సి రావచ్చు.
ఆదాయంతో లావాదేవీలు సరిపోవాలి
ఐటీఆర్‌లో చూపిన ఆదాయం కంటే బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు కనిపిస్తే అనుమానం రావచ్చు. ఉదాహరణకు రూ.12 లక్షల ఆదాయానికి రూ.32 లక్షల డిపాజిట్లు ఉంటే మిగిలిన మొత్తంపై వివరణ అడగవచ్చు.
కరెంట్ ఖాతాలో పెద్ద డిపాజిట్లు
వ్యాపార అవసరాల కోసం నిర్వహించే కరెంట్ ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలకు మించి నగదు డిపాజిట్లు జరిగితే సమాచారం ఐటీ శాఖకు చేరుతుంది.
క్రెడిట్ కార్డ్ చెల్లింపులు
ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు రూ.10 లక్షలు దాటితే ఆ వివరాలు ఐటీ శాఖకు నివేదించవచ్చు. చూపించిన ఆదాయంతో పోలిస్తే ఖర్చులు ఎక్కువగా ఉంటే వివరణ కోరే అవకాశం ఉంటుంది.
నగదుతో క్రెడిట్ కార్డ్ బిల్లు
క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో రూ.1 లక్షకు మించి చెల్లించినా ఆ లావాదేవీ వివరాలు ఐటీ శాఖకు చేరవచ్చు. అందుకే పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులకు సంబంధించి ఆధారాలు ఉండాలి.
రూ.30 లక్షలకు మించిన ఆస్తి కొనుగోలు
రూ.30 లక్షలకు పైగా విలువైన ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వివరాలు ఐటీ శాఖకు నివేదిస్తారు. ఆస్తి కొనుగోలుకు ఉపయోగించిన నిధుల సోర్స్‌ మీ ఆదాయంతో సరిపోవాలి.
భారీ విలువైన ఆస్తి విక్రయం
రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తిని విక్రయించినప్పుడు ఆ లావాదేవీని ఐటీఆర్‌లో సరిగ్గా చూపించాలి. విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించకపోతే ఐటీ శాఖ నుంచి వివరణ కోరే అవకాశం ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు
ఒక ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10 లక్షలకు మించి పెట్టుబడి పెడితే ఆ వివరాలు ఐటీ శాఖ దృష్టికి వెళ్లవచ్చు.
షేర్లు, బాండ్లలో పెట్టుబడులు
షేర్లు, బాండ్లు వంటి పెట్టుబడుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి పెట్టుబడి పెట్టినా వివరాలు నివేదించబడే అవకాశం ఉంది.
ఐటీ నోటీసు వస్తే ఏం చేయాలి?
నోటీసు వచ్చినంత మాత్రాన పన్ను ఎగవేత జరిగినట్లు కాదు. మీ డబ్బు మూలాన్ని వివరించే సరైన పత్రాలు, ఆధారాలతో ఐటీ శాఖకు సమాధానం ఇవ్వాలి.