పీఎఫ్ ఖాతాదారులకు కీలక పరిణామం

ఈపీఎఫ్ఓ పరిధిలోని ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షన్‌దారులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపుపై ఆశలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఎంత పెన్షన్ వస్తోంది?
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద అర్హులైన వారికి ప్రస్తుతం నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ అందుతోంది. ఈ మొత్తం ఎన్నో సంవత్సరాలుగా మారకపోవడంతో పెంపు కోసం డిమాండ్లు వస్తున్నాయి.
రూ.7,500కి పెంచాలనే ప్రతిపాదన
కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు, పెన్షన్‌దారులు కోరుతున్నారు.
నవంబర్ 19న కీలక సమావేశం
ఈపీఎఫ్ఓ 240వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం నవంబర్ 19న గుజరాత్‌లోని గిర్‌లో జరగనుంది. ఈ భేటీలో పెన్షన్ పెంపు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డిమాండ్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్‌ను సవరించాలని పెన్షన్‌దారులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ విషయంపై కార్మిక సంఘాలు కేంద్రానికి పలుమార్లు వినతులు సమర్పించాయి.
వేతన పరిమితి పెంపు నేప‌థ్యంలో
ఈపీఎఫ్ఓ పరిధిలో వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన నేప‌థ్యంలో పెన్షన్‌కు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
EPS పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
ఉద్యోగి పెన్షన్‌ను చివరి 60 నెలల సగటు పెన్షన్‌కు అర్హమైన వేతనం, అర్హత కలిగిన సర్వీస్ ఆధారంగా లెక్కిస్తారు. ఇందుకోసం వేతనాన్ని సర్వీస్ సంవత్సరాలతో గుణించి 70తో భాగిస్తారు.
పదేళ్ల సర్వీస్ తప్పనిసరి
ఈపీఎస్ పెన్షన్ పొందాలంటే కనీసం పదేళ్ల అర్హత కలిగిన సర్వీస్ పూర్తి చేయాలి. సాధారణంగా 58 ఏళ్ల వయసు నుంచి నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
పదేళ్లలోపు సర్వీస్ ఉంటే ఏం జరుగుతుంది?
అవసరమైన పదేళ్ల సర్వీస్ పూర్తికాకపోతే నిబంధనల ప్రకారం ఉద్యోగి EPS మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు సర్వీస్ కాలం, నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు.
పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం ఎప్పుడంటే?
క‌నీస పెన్ష‌న్ క‌చ్చితంగా రూ. 7500 అవుతుంద‌ని చెప్ప‌లేం. బోర్డు సమావేశం తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది.