వారణాసి

గంగానది ఒడ్డున వెలసిన వారణాసిని హిందువులు అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. పురాతన కాలంలో ‘కాశీ’గా ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. గంగా ఇక్కడ ఉత్తర దిశగా ప్రవహించడం ప్రత్యేకత. ఘాట్‌ల వద్ద జరిగే పూజలు, గంగా హారతి, ఆలయాల సందడి.. వారణాసికి ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తాయి.
హరిద్వార్
హిమాలయ పర్వత పాదాల నుంచి గంగ మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశమే హరిద్వార్. భారతదేశంలోని సప్తపురుల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గంగా ఘాట్‌లు, ఆలయాలు, పుణ్యస్నానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ నగరం ఎప్పుడూ భక్తి వాతావరణంతో కనిపిస్తుంది.
రిషికేశ్
యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రదేశం రిషికేశ్. గంగానది తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక సాధకులతో శతాబ్దాల అనుబంధం ఉంది. 1968లో బీటిల్స్‌ బృందం ఇక్కడికి రావడంతో ప్రపంచ దృష్టి మరింతగా రిషికేశ్‌పై పడింది.
అమృత్‌సర్
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరం సిక్కు మతానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇక్కడి హర్మందిర్ సాహిబ్‌నే సాధారణంగా గోల్డెన్ టెంపుల్‌గా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలోని లంగర్‌ ప్రత్యేక ఆకర్షణ. ప్రతిరోజూ వేలాది మందికి ఉచితంగా భోజనం అందించడం సేవాభావానికి గొప్ప ఉదాహరణ.
పుష్కర్
రాజస్థాన్‌లోని పుష్కర్‌ ప్రశాంతమైన ఆధ్యాత్మిక పట్టణం. ఇక్కడి బ్రహ్మ ఆలయం దేశంలోనే అరుదైన బ్రహ్మ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర పుష్కర్ సరస్సు చుట్టూ అనేక ఘాట్‌లు, ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి సంబంధించిన పురాణ కథనాలతో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
తిరువణ్ణామలై
తమిళనాడులోని తిరువణ్ణామలై శైవ భక్తులకు అత్యంత ముఖ్యమైన క్షేత్రం. అరుణాచల పర్వతం, విశాలమైన అరుణాచలేశ్వర ఆలయం, రమణ మహర్షి ఆశ్రమం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, గిరిప్రదక్షిణకు ఇది ప్రసిద్ధి.
ధర్మశాల
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల, మెక్‌లియాడ్‌గంజ్ ప్రాంతాలు టిబెటన్‌ బౌద్ధ సంస్కృతికి ముఖ్య కేంద్రాలుగా మారాయి. దలైలామా ఇక్కడ నివసించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, ధ్యాన సాధకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. హిమాలయాల ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుంది.
కాసర్‌దేవి
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా సమీపంలోని కాసర్‌దేవి చిన్నదైనా ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ప్రాంతంగా పేరొందింది. ప్రకృతి అందాలు, హిమాలయ దృశ్యాలు, ప్రశాంత వాతావరణం కారణంగా కళాకారులు, రచయితలు, ధ్యాన సాధకులు ఇక్కడికి ఆకర్షితులయ్యారు. జార్జ్ హారిసన్, బాబ్ డిలన్ వంటి ప్రముఖులు కూడా ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉన్నారు.
మథుర–వృందావనం
శ్రీకృష్ణుడి జన్మస్థలంగా మథుర, బాల్యలీలలకు వేదికగా వృందావనాన్ని పురాణ కథనాలు చెబుతాయి. యమునా తీరం, కృష్ణుడికి సంబంధించిన ఆలయాలు, ఆశ్రమాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకత. జన్మాష్టమి, హోలీ వంటి పండుగల సమయంలో ఇక్కడి ఆధ్యాత్మిక సందడి మరింత పెరుగుతుంది.
బోధ్‌గయ
బీహార్‌లోని బోధ్‌గయ బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. సిద్ధార్థ గౌతముడు బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహాబోధి ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ యాత్రికులను ఆకర్షిస్తుంది.