యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు ఖాతాలో నగదు కట్ అయి, లబ్ధిదారుడికి చేరకపోతే సాధారణంగా ఐదు రోజుల్లోగా తిరిగి జమ చేయాలి. ఆ గడువు దాటితే ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.100 పరిహారం వర్తించవచ్చు.
ఏటీఎంలో నగదు రాకపోయినా..
ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసే సమయంలో ఖాతా నుంచి నగదు కట్ అయి, చేతికి రాకపోతే బ్యాంకు ఐదు రోజుల్లోగా మొత్తాన్ని తిరిగి జమ చేయాలి. ఆలస్యమైతే రోజుకు రూ.100 పరిహారం చెల్లించాల్సి రావచ్చు.
క్రెడిట్ కార్డు మూసివేతలో జాప్యం
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని ఖాతాదారుడు కోరినప్పుడు, బకాయిలు వంటి అవసరమైన షరతులు నెరవేరితే బ్యాంకు ఏడు పనిదినాల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. ఆలస్యమైతే రోజుకు రూ.500 పరిహారం వర్తించవచ్చు.
లోన్ చెల్లించాక ఆస్తి పత్రాలు
రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకులు అసలు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంతో పాటు, అవసరమైన రిజిస్ట్రేషన్ ఛార్జీల తొలగింపునకు సంబంధించిన చర్యలను 30 రోజుల్లో పూర్తి చేయాలి.
క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే..
క్రెడిట్ రిపోర్టులో తప్పుడు బకాయిలు, తప్పు చెల్లింపు వివరాలు వంటి సమస్యలు కనిపిస్తే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు పరిష్కారంలో నిర్దేశిత గడువు దాటితే, వర్తించే నిబంధనల ప్రకారం రోజుకు రూ.100 పరిహారం లభించవచ్చు.
బ్యాంకు లాకర్లో వస్తువులు దెబ్బతింటే
బ్యాంకు నిర్లక్ష్యం లేదా భద్రతా లోపాల వల్ల లాకర్లోని వస్తువులకు నష్టం వాటిల్లితే, నిబంధనలకు అనుగుణంగా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సి రావచ్చు.
ఫిర్యాదు చేసినప్పుడు గడువు ముఖ్యం
బ్యాంకు సేవల్లో సమస్య తలెత్తితే ముందుగా సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేసి, ఫిర్యాదు నంబర్ను భద్రపరుచుకోవాలి. లావాదేవీ వివరాలు, సందేశాలు, బ్యాంకు సమాధానాలను ఆధారాలుగా ఉంచుకోవడం మంచిది.
పరిహారం ఆటోమేటిక్గా వస్తుందా?
ప్రతి సమస్యకు పరిహారం ఒకే విధంగా వర్తించదు. లావాదేవీ రకం, ఆలస్యానికి కారణం, వర్తించే RBI నిబంధనలు, మినహాయింపుల ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు.