ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు ఎవరైనా పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రణాళికకు ఇది ఉపయోగపడుతుంది.
పెట్టుబడి పరిమితి ఎంతంటే?
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ 7.10 శాతంగా ఉంది.
15 ఏళ్ల తర్వాత పొడిగింపు
పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ గడువు 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లయినా పెట్టుబడి కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది.
పన్ను ప్రయోజనాలు కూడా
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం అర్హమైన పెట్టుబడులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై కూడా పన్ను ఉండదు.
ఖాతాదారుడు చనిపోతే ఏం జరుగుతుంది?
పీపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే ఖాతాలోని నిల్వను నామినీ లేదా చట్టబద్ధ వారసులు పొందవచ్చు. మొత్తం చెల్లించిన తర్వాత ఆ ఖాతాను శాశ్వతంగా మూసివేస్తారు.
ఖాతాను కొనసాగించడానికి వీల్లేదు
ఖాతాదారుడి మరణం తర్వాత పీపీఎఫ్‌లో కొత్తగా డబ్బులు జమ చేయడం కుదరదు. అలాగే ఖాతా గడువును పొడిగించడం లేదా మరొకరి పేరుతో కొనసాగించడం సాధ్యం కాదు.
డబ్బులు పొందడానికి కావాల్సిన పత్రాలు
మరణ ధ్రువీకరణ పత్రం, ఫారం G, నామినీ గుర్తింపు పత్రాలను సమర్పించాలి. వారసులు క్లెయిమ్ చేస్తే సంబంధిత వారసత్వ పత్రాలు కూడా అందించాలి.
రూ.లక్షలోపు ఉంటే ప్రత్యేక వెసులుబాటు
పీపీఎఫ్ ఖాతాలోని మొత్తం రూ.1 లక్ష కంటే తక్కువగా ఉంటే, కొన్ని నిబంధనల ప్రకారం చట్టబద్ధ వారసులు సక్సెషన్ సర్టిఫికేట్ లేకుండానే క్లెయిమ్ చేయవచ్చు.
నామినీగా నలుగురికి అవకాశం
ఖాతాదారుడు గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా నియమించుకోవచ్చు. అవసరమైతే ఎప్పుడైనా వారి వివరాలను మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్పులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
నామినీ లేకపోతే ఏం చేయాలి?
నామినీ లేకుంటే చట్టబద్ధ వారసులు తమ హక్కును నిరూపించుకోవాలి. ఇందుకు తహసీల్దార్ జారీ చేసే వారసుల ధ్రువీకరణ పత్రం లేదా అధిక మొత్తాల క్లెయింలకు జిల్లా కోర్టు ఇచ్చే సక్సెషన్ సర్టిఫికేట్ అవసరం కావచ్చు. వీటిని పొందడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.