RCB : అమ్మకానికి ఆర్సీబీ.. కొనుగోలు చేసేందుకు రేసులో  5 అగ్రశ్రేణి కంపెనీలు!

RCB : అమ్మకానికి ఆర్సీబీ.. కొనుగోలు చేసేందుకు రేసులో  5 అగ్రశ్రేణి కంపెనీలు!
x

RCB : అమ్మకానికి ఆర్సీబీ.. కొనుగోలు చేసేందుకు రేసులో  5 అగ్రశ్రేణి కంపెనీలు!

Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ఫ్రాంఛైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో కొత్త యజమాని చేతికి వెళ్లనుంది.

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ఫ్రాంఛైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో కొత్త యజమాని చేతికి వెళ్లనుంది. ప్రస్తుతం ఆర్సీబీ యజమానిగా ఉన్న డియాజియో సంస్థ ఈ టీమ్‌ను అమ్మకానికి సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్సీబీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16,000 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రతిష్ఠాత్మక ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడానికి దేశంలోని ఐదు అగ్రశ్రేణి కంపెనీలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్ కూడా ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని విక్రయించాలని ప్రస్తుత యజమాని డియాజియో నిర్ణయించింది. ఈ టీమ్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. దేశంలోని అత్యంత ధనిక పారిశ్రామికవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అదానీ గ్రూప్ ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంఛైజీ కోసం ప్రయత్నించింది కానీ విజయం సాధించలేకపోయింది.

అదానీ గ్రూప్ మార్కెట్ విలువ సుమారు రూ.17 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఈ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్‎లో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంఛైజీని కలిగి ఉంది. ఆర్సీబీ కొనుగోలు రేసులో ఫార్మా, పారిశ్రామిక రంగాలలో ఉన్న మరో రెండు దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదార్ పూనావాలా కూడా ఈ రేసులో ఉన్నారు. సరైన ధర పలికితే ఆర్సీబీ మంచి జట్టు అవుతుందని ఆయన గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కంపెనీ విలువ రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ.

సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ కూడా ఆర్సీబీని సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ గ్రూప్ ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌లో కో-ఓనర్‌గా ఉంది. ఒకవేళ JSW, RCBని కొనుగోలు చేస్తే, వారు ఢిల్లీ క్యాపిటల్స్‌లోని తమ వాటాను అమ్మే అవకాశం ఉంది. దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువైన JSW గ్రూప్ ఇప్పటికే బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌ను నడుపుతోంది. పై మూడు పెద్ద సంస్థలతో పాటు, మరో రెండు సంస్థలు కూడా ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నాయి.

ప్రముఖ పారిశ్రామికవేత్త రవి జైపురియా కూడా బిడ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కంపెనీ దేవయాని ఇంటర్నేషనల్, దేశంలో కెఎఫ్‌సి, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి ఫాస్ట్‌ఫుడ్ చైన్‌లను నిర్వహిస్తోంది. అలాగే వరుణ్ బెవరేజెస్ ద్వారా పెప్సీ బాటిళ్లను కూడా తయారు చేస్తున్నారు. ఆయనకు ఇంతకు ముందు ఏ స్పోర్ట్స్ ఫ్రాంఛైజీలోనూ భాగస్వామ్యం లేదు. ఐదో కంపెనీగా అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కూడా ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అయితే, ఈ సంస్థ పేరు వివరాలు ఇంకా బయటకు రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories