Jubilee Hills Bypoll Results Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న హస్తం..!

Jubilee Hills Bypoll Results Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న హస్తం..!
x

Jubilee Hills Bypoll Results Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న హస్తం..!

Highlights

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తుండగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చడం, 186 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించడం ద్వారా ఎన్నికల నిర్వహణ యంత్రాంగం ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టింది.

అన్నింటికంటే ముందుగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో కాంగ్రెస్‌కు అత్యధిక ఓట్లు రావడం, బీఆర్ఎస్ కంటే ముందంజ వేయడం ప్రారంభ దశలోనే రాజకీయ వాతావరణాన్ని కాంగ్రెస్కు అనుకూలంగా మార్చింది. పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేయగా, షేక్‌పేట్‌ డివిజన్‌లోని 42 బూత్‌ల ఓట్ల లెక్కింపు మొదలైంది.

లెక్కింపు మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యంతో ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్‌కు 62 ఓట్ల మెజారిటీ లభించగా, రెండో రౌండ్‌లో ఈ ఆధిక్యం వేయికి పైగా పెరిగింది. ప్రతి రౌండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. రెండో, మూడో, నాలుగో రౌండ్లలో క్రమంగా కాంగ్రెస్ ఆధిక్యం మరింతగా పెరిగి, ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి 10 వేల ఓట్లకు చేరువైన భారీ మెజారిటీ నమోదైంది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్‌కు 12,857 ఓట్ల ఆధిక్యం లభించినట్లు లెక్కింపు అధికారులు వెల్లడించారు.

కౌంటింగ్ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహభరితంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. గాంధీభవన్‌లో ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలు VH, మెట్టు సాయి తదితరులు కేక్ కట్ చేస్తూ విజయోత్సవాలను ప్రారంభించడం గమనార్హం. నవీన్ యాదవ్ తాము భారీ మెజారిటీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేయగా, ఉదయం కౌంటింగ్‌కు వెళ్లేముందు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు.

ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కౌంటింగ్ కేంద్రంలోకి తన వెంట ఇద్దరు ఏజెంట్లను అనుమతించాలని కోరినా, ఎన్నికల అధికారులు ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే అనుమతి అనే నిబంధనను స్పష్టం చేశారు. దీంతో ఆమెతో కలిసి కేవలం ఒక ఏజెంట్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు.

కౌంటింగ్ కొనసాగుతుండగా, ఎన్నికల ప్రక్రియలో విషాదకర సంఘటన కూడా చోటుచేసుకుంది. ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో మరణించారని సమాచారం. ఎర్రగడ్డలో నివసిస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మరణించడంతో ఉప ఎన్నిక వాతావరణం కాసేపు విషాదంలో మునిగింది.

జూబ్లీహిల్స్‌లో మొత్తం ఓట్లు 4,01,365 ఉండగా, నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో 48.49% పోలింగ్ నమోదైంది. పోలైన ఓట్లు 1,94,621. కౌంటింగ్ వేగం చూస్తుంటే మరో రెండు, మూడు గంటల్లో తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటితో గెలుపు దిశగా సాగుతున్నట్లు తాజా లెక్కింపులు సూచిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories