TS High Court: అంబులెన్సుల నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court
x

 తెలంగాణ హై కోర్ట్ ఫైల్ ఫోటో 

Highlights

Ts High Court: తమ ఆదేశాలను పాటించకపోవండంపై సీరియస్‌ తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు స్టే అమల్లో ఉంటుందన్న హైకోర్టు

Ts High Court: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన అంబులెన్సులకు లైన్ క్లియరైంది. అంబులెన్సులు హైదరాబాద్ వచ్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చిన హైకోర్టు..బోర్డర్‌లో అంబులెన్సుల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపొద్దన్న తమ ఆదేశాలను పాటించకపోవండంపైనా సీరియస్‌ అయ్యింది. తాము వద్దన్న పనిని ప్రభుత్వం చేసి చూపిస్తుందన్న హైకోర్టు.... సర్కారు చర్యలు కోర్టు ధిక్కరణ కిందకి వస్తాయంటూ హెచ్చరించింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీ నుంచి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు వెళుతుండగా, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సాయంతో అంబులెన్సులను నిలిపివేస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అంబులెన్సులను ఆపొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

నేటి విచారణలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తమ వాదనలు వినిపించింది. ఏపీ సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకుంటే అది ఆర్టికల్ 14 ఉల్లంఘనే అని ఏజీ వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ... తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము వ్యవహరిస్తున్నామని, ఇతర రాష్ట్రాల వారు వస్తే కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది.

అయితే, తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై సానుకూలంగా స్పందించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను నిలుపుదల చేసిన హైకోర్టు... అంబులెన్సులు ఆపేందుకు వీల్లేదని తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాత సర్క్యులర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories