ఏపీ పారిశ్రామిక రంగానికి ఊపునిచ్చే ఎంఎస్ఎంఈ సమ్మిట్..విజయవాడ వేదికగా కీలక సదస్సు
Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి కూటమి ప్రభుత్వం భారీ ప్లాన్ వేసింది.
ఏపీ పారిశ్రామిక రంగానికి ఊపునిచ్చే ఎంఎస్ఎంఈ సమ్మిట్..విజయవాడ వేదికగా కీలక సదస్సు
Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత పటిష్టం చేస్తూ, ఈ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 25న విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్–2026 నిర్వహించనుంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఈ సదస్సు ప్రధాన వేదిక కానుంది.
*సీఎం చేతుల మీదుగా 38 పార్కులకు శ్రీకారం*
ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై రాష్ట్రంలోని 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో పాటు పలువురు మంత్రులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొననున్నారు.
*1500 మందికి పైగా ప్రతినిధుల హాజరు*
రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులు, విధాన రూపకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పరిశ్రమల రంగ అభివృద్ధికి అవసరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
*ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలపై దృష్టి*
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్లగ్-అండ్-ప్లే విధానానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సమ్మిట్ వేదికగా పలు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.
*ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుల*
లక్ష్యం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది...
ఇందులో భాగంగా మూడో విడతలో 38 పార్కులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే తొలి రెండు విడతల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనలు పూర్తవగా, కొన్ని ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి.
*క్లస్టర్ డెవలప్‌మెంట్‌కు పెద్దపీట*
ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ విస్తరణ కేంద్రాలను కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
*రూ.200 కోట్లతో సౌకర్యాల విస్తరణ*
రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటు కోసం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతు లభించనుంది.
*యువత, మహిళలకు అవకాశాలపై ఫోకస్*
ఈ సమ్మిట్‌లో యువత, మహిళలకు అవగాహన పెంపొందించే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది.
*రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మైలురాయి*
రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చేలా, సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026 రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.




