పర్యాటక పోలీసు’తో భద్రతకు కొత్త దిశ.. పర్యాటకుల కోసం ప్రత్యేక భద్రతా విధానానికి సన్నాహాలు
Amaravati: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.
పర్యాటక పోలీసు’తో భద్రతకు కొత్త దిశ.. పర్యాటకుల కోసం ప్రత్యేక భద్రతా విధానానికి సన్నాహాలు
Amaravati: రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే దేశీయ, విదేశీ పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ “పర్యాటక పోలీసు” విధానాన్ని తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ అంశాన్ని క్యాబినెట్‌లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే ముందు భద్రతా వాతావరణం ఉండాలని, ఒకసారి పర్యాటకులకు మంచి అనుభూతి కలిగితే వారు మరెందరికో చెప్పడం ద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డారు.
*ఎకో టూరిజంతో యువతకు భారీ ఉపాధి*
50 వేల మందికి ఉద్యోగ అవకాశాల లక్ష్యం
ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుమారు 50 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. పర్యాటకం అభివృద్ధి చెందితే హోటల్స్, రవాణా, గైడ్స్, హోమ్ స్టేలు, చిన్న వ్యాపారాలు వంటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని వివరించారు.
*200 దర్శనీయ ప్రాంతాల గుర్తింపు,ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశం*
రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ప్రకృతి, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను గుర్తించేందుకు అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడి వసతులు, రవాణా, పర్యాటక సదుపాయాలు, అభివృద్ధి అవకాశాలపై పూర్తి నివేదికను ఐదు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు..ఈ ప్రాంతాలను భవిష్యత్తులో ప్రత్యేక టూరిజం సర్క్యూట్లుగా అభివృద్ధి చేసే అవకాశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు పర్యాటక మ్యాప్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు...
*గ్రామాలకు పర్యాటక శోభ*
పల్లెలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే యత్నం
ప్రత్యేకతలు, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు కలిగిన గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నప్పటికీ అక్కడ సరైన సదుపాయాల లేమి వల్ల పర్యాటకులు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్నారు. గ్రామాల్లో హోమ్ స్టేలు, పరిశుభ్రత, రహదారులు, వసతి సదుపాయాలు, స్థానిక ఆహార ప్రత్యేకతలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు..ఈశాన్య రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ఉదాహరణగా తీసుకుంటూ, అతిథిని దేవుడిలా చూసుకునే ఆతిథ్య సంస్కృతిని గ్రామాల్లో పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రారంభ దశలో పైలెట్ ప్రాజెక్టులుగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు.
*ప్రకృతి – పర్యాటకం కలయిక*
ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
రాష్ట్రంలోని ప్రత్యేక ప్రకృతి ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సమీక్షలో ప్రస్తావించారు. కర్నూలు జిల్లాలో కృష్ణ జింకల సంరక్షణ ప్రాంతం, నల్లమలలోని బైర్లూటి, నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలు వంటి ప్రదేశాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని సూచించారు...ప్రకృతి అందాలు, జీవ వైవిధ్యం, స్థానిక ప్రత్యేకతలను ఆధారంగా చేసుకొని టూరిజం అభివృద్ధి చేస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. అయితే అభివృద్ధి పేరుతో ప్రకృతి, వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
*క్షేత్రస్థాయి పర్యటనలకు ఆదేశం*
టూరిజం యాప్ – రూట్ మ్యాప్ రూపకల్పన
అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేయాలని సూచించారు. గుర్తించే ప్రతి ప్రాంతానికి సంబంధించిన రూట్ మ్యాప్, అక్కడి సౌకర్యాలు, సమీప పర్యాటక ప్రాంతాలు, ప్రయాణ సమాచారం వంటి వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాలని ఆదేశించారు.
గుర్తించిన 200 ప్రాంతాలను టూరిజం సర్క్యూట్లుగా మార్చి, పర్యాటక సంస్థలు ప్యాకేజీల రూపంలో ప్రచారం చేసేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు. దీనివల్ల ఒకే యాత్రలో అనేక ప్రాంతాలను సందర్శించే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
*ఆధ్యాత్మిక – ప్రకృతి పర్యాటకానికి కాంబో ప్యాకేజీలు,భక్తులకు కొత్త అనుభవం*..
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సమీపంలోని ప్రకృతి ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. భక్తులు ఒకేసారి దైవ దర్శనం, ప్రకృతి సందర్శన అనుభవం పొందేలా “కాంబో టూరిజం” ప్యాకేజీలు తీసుకురావాలని ప్రతిపాదించారు.
దేవాదాయ, పర్యాటక శాఖల సేవలను ఒకే వేదికపైకి తీసుకువస్తే యాత్రికులకు మరింత సౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
*పర్యాటక స్వర్గధామంగా ఏపీ లక్ష్యం,
రాష్ట్రానికి జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు దిశగా అడుగులు*
పర్యాటకం అంటే కేవలం సందర్శన మాత్రమే కాకుండా ఉపాధి, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ పురోగతి, రాష్ట్ర ప్రతిష్టతో ముడిపడి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకుల భద్రత, ఆధునిక సదుపాయాలు, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ భాగస్వామ్యం కలిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యలు విజయవంతమైతే రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.




