రొయ్యల రైతులకు అండగా ప్రభుత్వం, ఫీడ్ ధరలు, విద్యుత్ రాయితీలపై కీలక నిర్ణయాలు..
Achannaidu: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్. జూన్ 1 నుంచి అదనంగా 12 వేల కనెక్షన్లకు విద్యుత్ రాయితీ ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు.
రొయ్యల రైతులకు అండగా ప్రభుత్వం, ఫీడ్ ధరలు, విద్యుత్ రాయితీలపై కీలక నిర్ణయాలు..
Achannaidu: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా రొయ్యల సాగు ద్వారా వేలాది మంది రైతులు ఉపాధి పొందుతుండగా, రాష్ట్రానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తోంది. అయితే ఇటీవల రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదల కారణంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో విజయవాడలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
*రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం*
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రొయ్యల రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ రంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోందన్నారు. ఆక్వా రంగం అభివృద్ధి చెందితేనే రైతులకు లాభాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటుగా ఉంటుందని పేర్కొన్నారు.
*ఫీడ్ ధరల పెంపుపై రైతుల ఆందోళన*
సమావేశంలో రైతులు ప్రధానంగా ఫీడ్ ధరల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగిపోతున్న సమయంలో ఫీడ్ ధరలు భారీగా పెరగడం వల్ల తమపై అదనపు భారం పడుతోందని వారు వివరించారు. ఫీడ్ ధరల పెంపును నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కొత్త విధానం అమలులోకి వచ్చే వరకు తాత్కాలికంగా కిలో ఫీడ్‌పై రూ.6 మాత్రమే పెంపు చేయాలని సూచించారు.
*రొయ్యల సాగులో ఫీడ్ ఖర్చు మొత్తం ఉత్పత్తి*
వ్యయంలో అత్యధిక భాగం ఉంటుందని, అందువల్ల ధరల పెంపు నేరుగా రైతుల లాభాలపై ప్రభావం చూపుతోందని రైతు సంఘాల ప్రతినిధులు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు.
*తయారీదారుల వాదన ఇదే*
మరోవైపు ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు కూడా తమ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించారు. ఫీడ్ తయారీలో ఉపయోగించే ప్రధాన ముడిసరుకులు అయిన ఫిష్‌మీల్, సోయాబీన్ ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని, ధరల సవరణ తప్పనిసరి పరిస్థితిగా మారిందని పేర్కొన్నారు..ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచకుండా ఉత్పత్తిని కొనసాగించడం కష్టమని వారు వెల్లడించారు. అయితే రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సూచించే పరిష్కారాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
*శాస్త్రీయ విధానంతో ధరల నిర్ణయం*
ఫీడ్ ధరల అంశంపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. రైతులు, తయారీదారులు ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా పారదర్శక వ్యవస్థ ఉండాలని చెప్పారు. ధరల నిర్ణయం ఒక నిర్దిష్ట ప్రమాణం ఆధారంగా జరిగితే వివాదాలకు తావు ఉండదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాటర్ ఆక్వాకల్చర్ (సీబా), మత్స్యశాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఫీడ్ తయారీ సంస్థల సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కమిటీ ఫీడ్ ధరల నిర్ణయానికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.
*ఇంకా తుది నిర్ణయం లేదు*
సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ఫీడ్ ధరల విషయంలో ఇంకా తుది ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. అయితే సమస్యను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం సూచించింది.కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు కిలోకు రూ.12 వరకు ధరల పెంపు అంశాన్ని పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తయారీదారులు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. రైతుల అభ్యర్థనలు, తయారీదారుల వాదనలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
*ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు భారీ ఊరట*
ఫీడ్ ధరల అంశంతో పాటు ఆక్వా రైతులకు ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. జూన్ 1 నుంచి అదనంగా 12 వేల ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీ వర్తింపజేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ అందజేయనున్నట్లు తెలిపారు.ఈ రాయితీ చిన్న రైతులకు మాత్రమే కాకుండా పెద్ద ఫారాలకు కూడా సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హులైన అన్ని కనెక్షన్లకు సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు.
*ఉత్పత్తి వ్యయం తగ్గించే చర్యలు*
విద్యుత్ రాయితీ వల్ల రైతుల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఫీడ్, విద్యుత్, కార్మిక వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం రైతులకు కొంత ఊరటనిస్తుందని చెప్పారు.
ఆక్వాకల్చర్ రంగంలో పోటీతత్వ సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఎగుమతులను పెంచడం, రైతులకు మెరుగైన ధరలు అందించడం వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
*ఆక్వా రంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి*
రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగం మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.ఫీడ్ ధరల వివాదానికి త్వరలోనే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం, రైతులు, పరిశ్రమల మధ్య సమన్వయంతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.




