Ghatkesar: నీటి కోసం అల్లాడుతున్న అన్నోజిగూడ ప్రజలు!

Ghatkesar: ఘట్‌కేసర్ అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో నీటి కటకట.

KARUNAKAR, UPPAL
Published on: 9 Jun 2026 8:38 AM IST
Ghatkesar
X

Ghatkesar: నీటి కోసం అల్లాడుతున్న అన్నోజిగూడ ప్రజలు!

ఘట్‌కేసర్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఉన్న అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

కాలనీవాసుల వివరాల ప్రకారం, ఈ ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం కాకముందు కాలనీలో మొత్తం ఏడు బోర్‌వెల్లు ఉండేవి. వాటి ద్వారా నీటిని ట్యాంక్‌కు ఎక్కించి కాలనీవాసులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం వాటిలో ఐదు బోర్‌వెల్లు పనిచేయకుండా ఉండటంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. పనిచేయని బోర్‌వెల్లను మరమ్మతు చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బోర్‌వెల్లను బాగుచేయకపోయినా కనీసం కృష్ణా జలాలను క్రమం తప్పకుండా సరఫరా చేస్తారని ఆశించినా ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే బోరు నీరు సరఫరా జరుగుతోందని, అదీ చాలా తక్కువ సమయం మాత్రమే అందుతుండటంతో కుటుంబ అవసరాలకు సరిపడా నీరు అందడం లేదని చెబుతున్నారు. దీంతో చాలామంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

ఎన్నికల సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తాగునీటి సమస్యపై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా అధికారులు స్పందించడం లేదని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పనిచేయని బోర్‌వెల్లను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు కాలనీవాసులకు ప్రతిరోజూ తగిన తాగునీటి సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న నీటి సంక్షోభాన్ని అత్యవసరంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story