AI Decodes Ancient Script: చరిత్రను మార్చేసిన ఏఐ...3500 ఏళ్లనాటి లిపి డీకోడ్‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3500 ఏళ్లనాటి లిపిని కేవలం ఐదు నిమిషాల్లో డీకోడ్‌ చేశారు. దీనికోసం సరికొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ ద్వారా పురాతనమైన లిపిని ఈజీగా డీకోడ్‌ చేయవచ్చని చెబుతున్నారు.

Balachander
Published on: 23 May 2026 12:40 PM IST
AI Decodes Ancient Script: చరిత్రను మార్చేసిన ఏఐ...3500 ఏళ్లనాటి లిపి డీకోడ్‌
X

AI Decodes Ancient Script: ఆధునిక సాంకేతికత ఎన్నో రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తోంది. ప్రస్తుత భవిష్యత్‌ కోసమే కాకుండా వేల ఏళ్లనాటి గతాన్ని కూడా తెలుసుకునేందుకు ఏఐ ఎంతగానో ఉపయోగపడుతున్నది. జర్మనీలోని 'యూనివర్సిటీ ఆఫ్ వర్జ్‌బర్గ్' పరిశోధకులు అభివృద్ధి చేసిన ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం.... చరిత్ర పరిశోధనల్లో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. దాదాపు 3500 సంవత్సరాల క్రితం, అనటోలియా ప్రస్తుతం టర్కీ ప్రాంతాన్ని పాలించిన శక్తివంతమైన ‘హిట్టైట్’ నాగరికతకు చెందిన రహస్య మట్టి పలకల లిపిని ఏఐ విజయవంతంగా డీకోడ్ చేసింది. శతాబ్దాలుగా ఎవరికీ అర్థంకాని ఈ పురాతన అక్షరాల వెనుక దాగి ఉన్న వింత లోకాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు సులువుగా చదవగలుగుతున్నారు. దీనంతటికీ కారణం ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అని చెబుతున్నారు. పురాతనమైన లిపిని ఏఐ ఏ విధంగా డీకోడ్‌ చేసిందో తెలుసుకుందాం.

పాలియోగ్రాఫికమ్’ సాఫ్ట్‌వేర్ సృష్టించిన అద్భుతం

హిట్టైట్ సామ్రాజ్యానికి చెందిన ప్రజలు క్రీస్తుపూర్వం 1600 కాలంలోనే మట్టి పలకలపై మొనదేలిన వస్తువులతో 'క్యునిఫార్మ్' శైలిలో తమ చరిత్రను లిఖించారు. అయితే, కాలక్రమేణా ఆ పలకలన్నీ ముక్కలై ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియంలలో చెల్లాచెదురయ్యాయి. ఈ లిపిలో గల 375 విభిన్న సంకేతాలను, వాటిని రాసిన వేర్వేరు వ్యక్తుల చేతిరాతలను గుర్తించడం మానవ మాత్రులకు దాదాపు అసాధ్యంగా మారింది. ఈ సవాలును అధిగమించడానికి పరిశోధకులు ‘పాలియోగ్రాఫికమ్’ అనే అధునాతన ఏఐ ప్యాటర్న్-రికగ్నిషన్ సాధనాన్ని రూపొందించారు. ఇది ఒక అద్భుతమైన డిజిటల్ నెట్‌వర్క్ లా పనిచేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ 70,000 డిజిటల్ ఛాయాచిత్రాలను పరిశీలించి, వాటిలో ఉన్న 50 లక్షల కంటే ఎక్కువ క్యునిఫార్మ్ అక్షరాల శైలిని క్షణాల్లో విశ్లేషిస్తుంది. గతంలో ఐదు మట్టి ముక్కలను ఒకదానితో ఒకటి పోల్చి, అవి ఒకే పలకకు చెందినవా కాదా అని నిర్ధారించడానికి పరిశోధకులకు కనీసం మూడు రోజులు పట్టేది. కానీ ఈ ఏఐ సాంకేతికత ఇప్పుడు ఆ పనిని కేవలం ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తోంది.

చేతిరాతల ఆధారంగా సామాజిక చరిత్ర

ఈ ప్రాజెక్ట్ జర్మనీకి చెందిన 'టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డార్ట్‌మండ్' సహకారంతో, ఐదేళ్ల పాటు సాగిన ‘క్యూకా’ పరిశోధనల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో మట్టిపై రాసిన దాదాపు 400 మంది లేఖరుల వ్యక్తిగత శైలిని, వారి చేతిరాత గుర్తులను విడివిడిగా గుర్తించేలా ఈ ఏఐకి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల సదరు లేఖరులు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా రాసేవారు? ఇంట్లో ఉన్నప్పుడు వారి అక్షరాల శైలి ఎలా ఉండేది? అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు. తద్వారా హిట్టైట్ సమాజం యొక్క పూర్తి సామాజిక, సంస్కృతిక చరిత్రను పునర్నిర్మించేందుకు ఈ ఏఐ టూల్ ఒక అమూల్యమైన వరంగా మారిందని ప్రపంచవ్యాప్త చరిత్రకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story