Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా కోర్టులో చుక్కెదురు.. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు రద్దు
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో పెద్ద షాక్ తగిలింది. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన 1 లక్షల డాలర్ల భారీ ఫీజు పెంపును కోర్టు రద్దు చేసింది.
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హెచ్-1బీ వీసా వ్యవహారంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం కొత్తగా ప్రవేశపెట్టిన భారీ వీసా ఫీజు విధానాన్ని అమెరికా కోర్టు తిరస్కరించింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల (దాదాపు రూ.83 లక్షలకు పైగా) కొత్త రుసుమును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, దానిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సోమవారం (జూన్ 8) కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో అమెరికా వెళ్లాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు చాలా పెద్ద ఉపశమనం లభించింది.
కోర్టు మెట్లు ఎక్కిన డెమోక్రాట్ రాష్ట్రాలు
బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి లియో సొరోకిన్ ఈ కీలకమైన తీర్పును వెలువరించారు. అంతకుముందు అమెరికాలోని 20 డెమోక్రటిక్ రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ అందరూ కలిసి ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో ఒక పెద్ద దావా వేశారు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై ఏటా లక్ష డాలర్ల భారీ రుసుమును విధించడం ఏమాత్రం సమంజసం కాదని, దీనివల్ల తమ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారు తమ పిటిషన్‌లో గట్టిగా వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది.
ఫీజు కాదు.. అది అక్రమ పన్ను అన్న కోర్టు
రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. జడ్జి లియో సొరోకిన్ తన తీర్పులో ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త హెచ్-1బీ వీసా కోసం వసూలు చేయాలనుకున్న ఈ భారీ రుసుము కేవలం ఒక అప్లికేషన్ ఫీజు లేదా జరిమానా లాంటిది కాదని, ఇది ఒక రకమైన అక్రమ పన్ను అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఇలాంటి పన్నులు విధించడానికి దేశ ప్రెసిడెంట్‌కు ఎలాంటి హక్కు లేదని, కేవలం అమెరికా కాంగ్రెస్ అనుమతితోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా అమెరికా విదేశాంగ శాఖ గానీ, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గానీ దీనిని అమలు చేయడం కుదరదని తేల్చి చెప్పారు.
విద్యా, ఆరోగ్య రంగాలపై దెబ్బ
ఈ వీసా విధానం అధ్యక్షుడు ట్రంప్ అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ భారీ ఫీజు పెంపు వల్ల అమెరికాలోని ఉన్నత విద్యా రంగాలు, వైద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలకమైన పబ్లిక్ సెలక్టర్లు తీవ్రంగా నష్టపోతాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నుంచి ఎలాంటి చట్టబద్ధమైన అధికారాలు లేకుండానే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై భారీగా టాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని జడ్జి సొరోకిన్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు.
భారత ఐటీ రంగానికి ఎందుకింత ముఖ్యం?
అమెరికా ప్రతి ఏటా దాదాపు 65 వేల మంది విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. దీనితో పాటు ఉన్నత చదువులు చదివిన అంతర్జాతీయ నిపుణుల కోసం మరో 20 వేల అదనపు వీసాలను 3 నుంచి 6 ఏళ్ల కాలపరిమితితో ఇస్తుంది. ఈ మొత్తం వీసాలలో ఏకంగా 70 శాతానికి పైగా కేవలం భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే పొందుతుంటారు. సాధారణంగా అమెరికన్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల వీసాల కోసం 2000 నుంచి 5000 డాలర్ల వరకు ఫీజు చెల్లిస్తుంటాయి. కానీ ట్రంప్ దానిని ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసరికి భారత ఐటీ కంపెనీలపై మోయలేని భారం పడింది. కోర్టు తీర్పుతో ఇప్పుడు కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి.
పై కోర్టుకు వెళ్తామంటున్న వైట్ హౌస్
అయితే, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ట్రంప్ సర్కార్ అసంతృప్తిగా ఉంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము పై కోర్టులో అప్పీల్ చేస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని, అప్పీల్ చేసిన తర్వాత ప్రస్తుతం వచ్చిన కోర్టు ఆర్డర్ ఖచ్చితంగా రివర్స్ అవుతుందనే నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ మార్క్ వీసా నిబంధనలకు బ్రేక్ పడినట్లయింది.




