Eyes Of God : ప్రకృతి సృష్టించిన మహా అద్భుతం.. నేరుగా ఆకాశం నుంచి భూమిని చూస్తున్న దేవుడి కళ్లు
Eyes Of God : బుల్గేరియాలోని ప్రసిద్ధ ప్రోహోద్నా గుహ దాని అద్భుతమైన కళ్ల వంటి ఆకృతితో Eyes of Godగా పిలవబడుతోంది. ఇక్కడి ప్రకృతి వింతలు, విశేషాల పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Eyes Of God
Eyes Of God : ఐరోపా ఖండంలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటైన బుల్గేరియాలో ఒక అద్భుతమైన, రహస్యమైన గుహ ఉంది. దీనిని మొదటిసారి చూసిన ఎవరైనా సరే.. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిందా లేక ఎవరైనా గొప్ప శిల్పి తన ఊహలతో చెక్కాడా అని ఆశ్చర్యపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రదేశాన్ని ఐస్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి కళ్లు అని పిలుస్తారు. ఈ గుహ పైకప్పు భాగంలో సహజసిద్ధంగా ఏర్పడిన రెండు భారీ గుండ్రని రంధ్రాలు ఉంటాయి. ఇవి చూడటానికి నూటికి నూరు శాతం మనుషుల కళ్లలాగే కనిపిస్తాయి. పగటిపూట సూర్యకిరణాలు ఆ రంధ్రాల గుండా గుహ లోపలికి ప్రవేశించినప్పుడు.. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే ఆకాశం నుండి భూమి వైపు నిశ్శబ్దంగా చూస్తున్నాడా అన్నట్లు భావన కలుగుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని కళ్లారా వీక్షించడానికి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.
పర్యాటకులను కట్టిపడేసే మాయాజాలం!
ఈ అద్భుతమైన గుహ బుల్గేరియా రాజధాని సోఫియా నగరానికి సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో, కార్లుకోవో గ్రామానికి సమీపంలోని లుకోవిత్ ప్రాంతంలో ఉంది. భౌగోళిక శాస్త్రం ప్రకారం.. వేల సంవత్సరాల పాటు సున్నపురాయి కొండలపై నీరు, గాలి తీవ్రమైన ప్రభావం చూపడం వల్ల ఈ రాళ్లు క్రమంగా కరిగిపోయి ఇలాంటి వింత ఆకారాలు ఏర్పడ్డాయి. దీని అసలు పేరు ప్రోహోద్నా గుహ. సాధారణ రోజుల్లో ఎంతో అందంగా కనిపించే ఈ గుహ.. వర్ష కాలంలో మరింత అద్భుతంగా మారిపోతుంది. ఆకాశం నుంచి పడే వర్షపు నీరు కళ్ల ఆకారంలో ఉన్న ఆ రంధ్రాల గుండా కిందకు జారుతుంటే.. కళ్ల వెంట నీళ్లు కారుతున్నట్లు, అంటే దేవుడు కన్నీరు పెడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే స్థానికులు, పర్యాటకులు ఆ నీటిని భగవంతుడి కన్నీళ్లు అని కూడా పిలుస్తుంటారు. ఆ సమయంలో గుహలో ఉండే నిశ్శబ్దం, చల్లని గాలి పర్యాటకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయి.
మానవ పరిణామ క్రమానికి సజీవ సాక్ష్యం
చరిత్రకారులు, శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ గుహ భూమి చరిత్రలోనే అత్యంత కీలకమైన క్వాటర్నరీ కాలంలో ఏర్పడింది. సరిగ్గా ఇదే కాలంలోనే భూమిపై మానవ పరిణామ క్రమం కూడా ఊపందుకుంది. ఈ ప్రోహోద్నా గుహ దాదాపు 880 అడుగుల పొడవుతో బుల్గేరియాలోనే అత్యంత పొడవైన గుహ మార్గాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. పురాతన కాలంలో ఇక్కడ ఆదిమానవులు నివసించినట్లు కొన్ని బలమైన ఆధారాలు కూడా లభించాయి. అందువల్ల ఇది కేవలం ప్రకృతి అందాలకే కాకుండా చారిత్రక పరిశోధనలకు కూడా కేంద్రంగా మారింది. దీని క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే పర్యాటక రంగంతో పాటు సినిమా రంగాన్ని సైతం ఆకర్షించింది. 1988 లో విడుదలైన టైమ్ ఆఫ్ వయలెన్స్ అనే ప్రసిద్ధ బుల్గేరియన్ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ గుహలోనే చిత్రీకరించారు. ఆ తర్వాత దీని కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరింది.
అడ్వెంచర్ ప్రియులకు కేరాఫ్ అడ్రస్
ఈ గుహ కేవలం ప్రకృతి ప్రేమికులనే కాకుండా సాహసాలు చేయాలనుకునే అడ్వెంచర్ ప్రేమికులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ గుహ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం సుమారు 148 అడుగుల భారీ ఎత్తును కలిగి ఉంటుంది. ఇంతటి భారీ ఎత్తు ఉండటం వల్ల ఇక్కడ బంగీ జంపింగ్, రాక్ క్లైంబింగ్ వంటి ఉత్కంठభరితమైన క్రీడలను నిర్వహిస్తుంటారు. ఆ ఎత్తుల నుంచి కిందకు దూకుతున్నప్పుడు గుహ లోపల కనిపించే వింత ఆకారాలు సాహసికులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తాయి. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన కానుకను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.




