Nuclear Weapons: షాకింగ్‌ రిపోర్ట్ః అణ్వాయుధాల తయారీ ఖర్చు ఏడాదికి 119 బిలియన్‌ డాలర్లు

ప్రపంచంలోని 9 అణ్వాయుధ దేశాలు 2025లో రికార్డు స్థాయిలో 119 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. అమెరికా, చైనా, రష్యా, భారత్ వ్యయాలు, ప్రపంచ భద్రతపై ప్రభావం భారీ ప్రభావం చూపుతున్నాయి.

Balachander
Published on: 9 Jun 2026 1:59 PM IST
Nuclear Weapons: షాకింగ్‌ రిపోర్ట్ః అణ్వాయుధాల తయారీ ఖర్చు ఏడాదికి 119 బిలియన్‌ డాలర్లు
X

Nuclear Weapons: ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం, వాతావరణ మార్పులతో కోట్లాది మంది ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు అగ్రరాజ్యాలు మాత్రం మానవాళిని క్షణాల్లో బూడిద చేసే అణ్వాయుధాల కోసం రికార్డు స్థాయిలో డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. తాజాగా ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్’ విడుదల చేసిన నివేదిక ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత ఏడాది అంటే 2025లో ప్రపంచంలోని కేవలం 9 అణ్వాయుధ దేశాలు తమ ఆయుధశేఖరణ కోసం ఏకంగా 119 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఈ భారీ బడ్జెట్‌తో ప్రపంచంలోని నాలుగైదు చిన్న దేశాల ప్రజలు ఎలాంటి లోటూ లేకుండా హ్యాపీగా బతికేందుకు అవకాశం ఉంటుంది.

అణ్వాయుధాల కోసం ఎవరెంత ఖర్చు చేశారు?

గత ఏడాదితో పోలిస్తే 2025లో అణ్వాయుధాల ఖర్చు 16.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ రేసులో ఎప్పటిలాగే అమెరికా అందరికంటే ముందుంది. మిగిలిన అన్ని దేశాల కంటే ఎక్కువగా 69.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 13.5 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్‌ 12.6 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తే, రష్యా 9.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ఇక ఫ్రాన్స్‌ 7.7 బిలియన్‌ డాలర్లను అణ్వాయుధాల తయారీకోసం ఖర్చు చేసింది. ఇక భారత్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయిల్‌, ఉత్తరకొరియాలు కలిపి 2.8 బలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేశాయి. ప్రతి ఏడాది అణ్వాయుధాల కోసం ఖర్చు పెంచుకుంటూ పోతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు అణ్వాయుధాలను తగ్గించుకోవాలని చెబుతూనే మరోవైపు అగ్రరాజ్యాలే పెద్ద ఎత్తున అణ్వాయుధాలు తయారు చేసుకుంటుండటం ఆందోళనకు దారితీస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఈ 9 దేశాలు అణ్వాయుధాల తయారీ కోసం చేసిన ఖర్చు అక్షరాల 471 బిలియన్‌ డాలర్లు.

శాంతి ఒప్పందాలు తుంగలో..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 12,000 కంటే ఎక్కువ అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం అమెరికా, రష్యాల వద్దే ఉన్నాయి. 1990వ దశకం నుండి ఇరు దేశాల మధ్య ఉన్న ఆయుధ నియంత్రణ ఒప్పందం ‘న్యూ స్టార్ట్’ ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిపోయింది. దీనిని పొడిగించేందుకు ఏ దేశమూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. 2017లో ఐక్యరాజ్యసమితి అణ్వాయుధాల నిషేధ ఒప్పందాన్ని తెచ్చినప్పుడు 99 దేశాలు సంతకాలు చేశాయి. కానీ, అసలు అణ్వాయుధాలు ఉన్న ఈ తొమ్మిది దేశాలలో ఒక్కటంటే ఒక్క దేశం కూడా ఇప్పటివరకు ఆ పత్రంపై సంతకం చేయలేదు. పర్యావరణ మార్పులను అడ్డుకోవడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి నిధులు లేవనే దేశాలు.. మానవాళిని అంతమొందించే ఆయుధాల ఆధునికీకరణ కోసం మాత్రం కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో చిన్న పొరపాటు జరిగినా భూగోళంపై మనుషుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story