Duvvuru: మూడిండ్లపల్లెలో ఒకే రాత్రి 10 మంది రైతుల మోటార్ వైర్లు చోరీ!
Duvvuru: కడప జిల్లా దువ్వూరు మండలంలో వరుసగా జరుగుతున్న కరెంట్ మోటార్ల వైర్ల దొంగతనాలు స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Duvvuru: మూడిండ్లపల్లెలో ఒకే రాత్రి 10 మంది రైతుల మోటార్ వైర్లు చోరీ!
Duvvuru: దువ్వూరు మండలంలో గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న కరెంట్ మోటార్ల వైర్ల దొంగతనాలు స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం రాత్రి మండల పరిధిలోని మూడిండ్లపల్లె గ్రామ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు 10 మంది రైతులకు సంబంధించిన బావుల వద్ద గల మోటార్ల వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే పొలాలకు వెళ్లిన రైతులు వైర్లు కాస్తా మాయమవ్వడం చూసి తలలు పట్టుకున్నారు.
నెల రోజులుగా వరుస చోరీలు
మండలంలో గత నెల రోజుల నుండి ఇదే తీరుగా పలుచోట్ల మోటార్ల వైర్ల దొంగతనాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి కష్టపడి పంటలు పండించే తమకు ఈ వైర్ల దొంగతనాల వల్ల వేల రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతోందని వాపోతున్నారు.
నిందితుడిని అప్పగించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా?
గత పది రోజుల క్రితం మీర్జాఖాన్ పల్లెలో ఇలాగే మోటార్ల వైర్లు దొంగతనం చేయడానికి వచ్చిన ఒక దొంగను స్థానిక ప్రజలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే, పట్టుబడిన నిందితుడిపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, అందుకే దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారని మండల ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
రాత్రి పూట గస్తీ పెంచాలని రైతుల డిమాండ్
ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో పొలాల బాటల్లో పోలీసు గస్తీ (పెట్రోలింగ్) పెంచి, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.




