ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో యాక్షన్: పిఠాపురంలో ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వాడకంపై పోలీసుల ముమ్మర ప్రచారం!
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం పట్టణంలో పోలీసులు, మహిళా పోలీసులు కలిసి భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
పిఠాపురం / కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు, కాకినాడ సబ్-డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజు పాటిల్ ఆదేశాలనుసారం, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది మరియు మహిళా పోలీసులతో కలిసి పిఠాపురం పట్టణంలో హెల్మెట్ వినియోగం మరియు ట్రాఫిక్ నిబంధనలపై హెల్మెట్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ హెల్మెట్ ర్యాలీ కార్యక్రమం పాదగయ శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం సమీపం నుండి ప్రారంభమై, పాత పోలీస్ స్టేషన్, ఉప్పాడ సెంటర్, మార్కెట్ సెంటర్, ఎస్‌బీఐ సెంటర్ మీదుగా ఉప్పాడ రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో హెల్మెట్ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలియజేశారు.
అదేవిధంగా, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రాణాపాయానికి దారితీస్తుందని అవగాహన కల్పించారు. "వేగం కన్నా ప్రాణం మిన్న", "ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇంటికి చేరుదాం" అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, బాధ్యతాయుతమైన వాహనదారులుగా వ్యవహరించాలని పోలీసు అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.




