Khammam: మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి.. మంత్రి ఆదేశం

Khammam: ధాన్యం, సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు మరియు పంట అవశేషాల దహనంపై డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 May 2026 6:18 PM IST
Khammam
X

Khammam: మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి.. మంత్రి ఆదేశం

Khammam: ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోళ్లను అనేక సవాళ్ల మధ్య కూడా సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది భారీ స్థాయిలో వరి దిగుబడి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవల మంత్రివర్గం సన్‌ఫ్లవర్ పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గతంలో రైతులకు ధాన్యం చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వ పాలనలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.

పట్టణాభివృద్ధిలో వాయు కాలుష్య నియంత్రణ అత్యంత కీలకమని, పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యంతో పాటు పక్క పొలాలకు మంటలు వ్యాపించి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు.

ప్రతి గ్రామంలో టామ్‌టామ్ ద్వారా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు పంట అవశేషాలను కాల్చవద్దని విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా ఎవరైనా పంట అవశేషాలను కాల్చేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని సూచించారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు వంద శాతం పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హమాలీలు, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వంద శాతం పెండింగ్ రైస్ డెలివరీ పూర్తి చేసిన డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి అండర్‌టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయాలని అన్నారు .

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంత్రివర్గం సన్‌ఫ్లవర్ కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అన్నారు. చివరి గింజ వరకు పంట కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, వరి కొయ్యలను కాల్చకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను సజావుగా నిర్వహించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫిడెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, డి సి ఓ శ్రీనివాస్ , డి సి ఎస్ ఓ ప్రేమ్ కుమార్, మెప్మా పీడీ రాజేష్, ఆర్టీసీ డిఎం, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story