మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బంపర్ ఆఫర్: హెడ్‌మాస్టర్‌కు రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటన!
మార్కాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల FLN శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. టెన్త్‌లో 592 మార్కులు సాధించిన గొట్లగట్టు స్కూల్ హెచ్‌ఎంకు రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు.
మార్కాపురం: సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని ఉదాహరణగా గొట్లగట్టు జడ్పీ హైస్కూల్ విద్యార్థి 592 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటాడని అన్నారు. ఆ పాఠశాల హెడ్‌మాస్టర్‌కు ఈ నెల 19న జరిగే మెగా పేరెంట్స్ డే సందర్భంగా రూ.1 లక్ష ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ప్రకటించారు. అలాగే 580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులను కూడా త్వరలో సత్కరించి ప్రోత్సాహకాలు అందజేస్తానని తెలిపారు.
మంచి విద్య ద్వారా విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టవచ్చని, వారు భవిష్యత్తులో ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవోలు రాందాస్ నాయక్, శ్రీనివాసులు, యూనియన్ నాయకులు ఒద్దుల వీరారెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




