Krishna: ఇంజనీర్ కావాలనుకున్న కృష్ణ...సినిమాల్లో సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఆ సంఘటనే కారణమా?
ఎలాగైనా ఇంజనీర్ వృత్తిని చేపట్టాలని కాలేజీలో చేరిన కృష్ణ... కాలేజీలో జరిగిన ఓ చిన్న సంఘటన తన జీవిత ప్రయాణాన్ని పూర్తిగా మలుపుతిప్పింది.
Krishna: తెలుగు సినిమా చరిత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెబుతాం. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని తారగా ఆవిర్భవించారు. సరికొత్త సాంకేతిక రంగాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో కూడా ఆయనే. కారణం ఆయన ఇంజనీరింగ్ విద్యార్థి అని చెబుతారు. తల్లిదండ్రులు కృష్ణను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు...కానీ, ఆయన ఆ కలను వదిలేసి కళామతల్లి కోసం మద్రాసు బాట పట్టడానికి కాలేజీలో జరిగిన ఓ చిన్న సంఘటనే కారణమని చెబుతారు. ఒక సాధారణ విద్యార్తిని ట్రెండ్ సెట్టర్ హీరోగా మార్చిన ఆ ఆసక్తికరమైన సంఘటన ఏంటో తెలుసుకుందాం.
ఏఎన్నార్ సన్మానం.. కృష్ణ మనసు మార్చిన క్షణం!
కృష్ణ తల్లిదండ్రులకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. కృష్ణను ఉన్నతమైన ఇంజనీర్‌గా చూడాలని అనుకున్నారు. దానికోసమే ఆయన కాలేజీలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. ఇంటర్ తరువాత ఏలూరులోని సీఆర్ రెడ్డీ కళాశాలో బీఎస్సీ చదువుతున్న సమయంలో కృష్ణ జీవితాన్ని మలుపుతిప్పే సంఘటన జరిగింది. ఇండస్ట్రీలో అప్పటికే ఓ అగ్రనాయకుడిగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు ఓ కార్యక్రమం కోసం ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజీకి వచ్చారు. ఆ సమయంలో అక్కినేనిని చూసి విద్యార్థులు చేసిన హంగామా, అరుపులు, కేకలు, అక్కినేనిని చూడటానికి వచ్చిన జనాన్ని చూసి కృష్ణ ఆశ్చర్యపోయారు. నటుడికి ఇంత క్రేజ్ ఉంటుందా అని అనుకున్నాడు. నటుడు...క్రేజ్ ఇవే ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. అప్పుడే సంకల్పం మొదలైంది. చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు... సినిమాల్లో రాణించేందుకు మద్రాస్ పయనమయ్యాడు.
ఎన్టీఆర్ సలహా ... తొలి అడుగులు
సినిమా అవకాశాల కోసం మద్రాస్ వెళ్లిన కృష్ణకు తొలినాళ్లలో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆ సమయంలో ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావును కలిశారు. కృష్ణను చూసిన ఎన్టీఆర్.. "ఇంకా చాలా లేతగా ఉన్నావు బ్రదర్, మరో రెండేళ్లు ఆగి ప్రయత్నించు" అని ప్రేమగా సలహా ఇచ్చారు. కానీ, కృష్ణ నిరాశచెందకుండా ప్రయత్నించి 1961లొ కులగొత్రాలు అనే సినిమాలో చిన్నపాత్ర వేశాడు. ఆ తరువాత పదండి ముందుకు, పరువు ప్రతిష్ట వంటి చిత్రాల్లో కూడా చిన్న పాత్రలు వేశాడు. నటుడిగా నటిస్తూ తనలోని నటుడికి మెరుగులు దిద్దాడు.
‘తేనె మనసులు’తో ట్రెండ్ సెట్టర్ ప్రస్థానం
చిన్న పాత్రలతో విసిగిపోయిన కృష్ణ.. హీరోగా మాత్రమే చేయాలని గ్యాప్ తీసుకున్నారు. అలా ప్రముఖ దర్శకుడు ఆదూర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965 మార్చి 31న విడుదలైన ‘తేనె మనసులు’ చిత్రంతో ఆయన పూర్తిస్థాయి హీరోగా మారారు. ఈ ఏడాదికి ఆ సినిమా విడుదలై సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తి కావడం విశేషం. ఇలా హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అక్కడితోనే ఆగిపోకుండా కళామతల్లికి మరింత కళ తీసుకొచ్చేందుకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. తెలుగులో మొదటి ఈస్ట్‌మన్ కలర్ సినిమా, మొదటి జేమ్స్ బాండ్ తరహా చిత్రం, మొదటి కౌబాయ్ సినిమా, మొదటి 70ఎంఎం స్కోప్ సినిమా.. ఇలా అన్నీ కృష్ణ ఖాతాలోనే ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆయన రోజుకు మూడు నాలుగు షిఫ్ట్‌లలో పనిచేస్తూ, ఏడాదికి 20 నుండి 30 సినిమాలు విడుదల చేసి రికార్డు సృష్టించారు. సీఆర్ రెడ్డి కాలేజీకి అక్కినేని రాకుండా ఉంటే...ఈరోజు సూపర్‌స్టార్ కృష్ణ మనకు పరిచయం అయ్యేవారు కాదేమో. కాలం ఎప్పుడు ఎవరిని ఏవిధంగా మారుస్తుందో చెప్పలేం కదా.




