సూర్యాపేట పోలీసుల ఘనత: రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేసిన ఎస్పీ!

Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో 13వ సెల్ ఫోన్ రికవరీ మేళా జరిగింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 9 Jun 2026 9:35 PM IST
సూర్యాపేట పోలీసుల ఘనత: రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేసిన ఎస్పీ!
X

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. జిల్లాలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న, చోరికి గురైన సుమారు 20 లక్షల రూపాయల విలువగల 102 మొబైల్ ఫోన్లను టెక్నాలజీ సాయంతో గుర్తించి రికవరీ చేశారు.

జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ గారి చేతుల మీదుగా 13వ సారి బాధితులకు ఆయా ఫోన్లను అందజేశారు. సంవత్సర కాలంలో ఇప్పటివరకు 1744 మొబైళ్లను యజమానులకు తిరిగి అందించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి నెల 100కి పైగా ఫోన్లు రికవరీ చేస్తున్నామన్నారు.

అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ విద్య, బ్యాంకింగ్‌కు నిత్యావసరమైందన్నారు. ఫోన్‌లో బ్యాంక్ అకౌంట్లు, పాస్‌వర్డ్లు, వ్యక్తిగత ఫోటోలు ఉంటాయి కాబట్టి అజాగ్రత్తగా ఉంటే ఆర్థిక నష్టంతో పాటు సమాచారం కూడా పోతుందని హెచ్చరించారు. వీక్ పాస్‌వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని చెప్పారు.

మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్ www.ceir.gov.in లో నమోదు చేసి, మీసేవ ద్వారా దరఖాస్తు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్లు రికవరీ చేశామని, ఇందుకు ఐటీ కోర్, సైబర్ వారియర్స్, టెక్నికల్ టీం కృషి చేశారని అభినందించారు.

సైబర్ మోసాలపై అవగాహన

తక్కువ వడ్డీకి లోన్లు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, బహుమతులు వచ్చాయనే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని సూచించారు. CBI, CID పేర్లు చెప్పి డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించడం అబద్ధమన్నారు. ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్‌లా ఉండి, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, బాధితులు పాల్గొన్నారు. ఫోన్లు తిరిగి వచ్చినందుకు బాధితులు ఎస్పీ, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story