Rs 2400 Crore Scam : రూ.2,400 కోట్ల భారీ స్కామ్.. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కు సీఐడీ నోటీసులు
Rs 2400 Crore Scam : బెళగావి శివం అసోసియేట్స్ రూ.2,400 కోట్ల మోసం కేసులో నటి సన్నీ లియోన్, నటులు ధనుంజయ, సప్తమీ గౌడ సహా పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమైంది.
Sunny Leone
Rs 2400 Crore Scam : కర్ణాటకలోని బెళగావి వేదికగా వెలుగు చూసిన శివం అసోసియేట్స్ భారీ ఆర్థిక కుంభకోణం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని సైతం కుదిపేస్తోంది. అమాయక వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి వంచించిన ఈ సంస్థ వ్యవహారంలో కీలక నటులకు నోటీసులు ఇచ్చేందుకు నేర పరిశోధన విభాగం రంగం సిద్ధం చేసింది. గత డిసెంబరు నెలలో ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కన్నడ ఉత్సవంలో పలువురు పాపులర్ సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆ సమయంలో వారికి లబ్ధిదారుల సొమ్ము నుంచే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందాయనే అనుమానంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు.
నోటీసులు అందుకోనున్న నటీనటులు వీళ్లే
ఈ స్కామ్‌కు సంబంధించి కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటులు డాలి ధనుంజయ, వశిష్ఠ సింహలతో పాటు క్రేజీ హీరోయిన్లు సప్తమీ గౌడ, రాగిణి ద్వివేదిలకు సీఐడీ నోటీసులు జారీ చేయనుంది. సదరు ఉత్సవంలో పాల్గొనడానికి వీరంతా ఎంతెంత పారితోషికం తీసుకున్నారు? ఆ డబ్బులు ఏ రూపంలో అందాయి? అనే విషయాలపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు కోరనున్నారు. ఈ స్టార్లందరినీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి విచారించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సన్నీ లియోన్‌కు రూ.కోటి పారితోషికంపై ఆరా
మరోవైపు, శివం అసోసియేట్స్ యజమాని శివానంద నీలణ్ణవర 2023లో ఛాంపియన్ అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ నటి సన్నీ లియోన్‌ను తీసుకువచ్చారు. అయితే ఈ సాంగ్‌లో నర్తించినందుకు గాను ఆమెకు ఏకంగా రూ.కోటి రూపాయలను పారితోషికంగా ఇచ్చినట్లు సీఐడీ అధికారులు రికార్డు పత్రాల ద్వారా గుర్తించారు. పేద ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ సొమ్మునే ఈ సినిమా కోసం, సన్నీ లియోన్ ఫీజు కోసం వాడినట్లు నిర్ధారణ కావడంతో, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆమెకు ఇప్పటికే సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
రూ.2,400 కోట్ల భారీ దోపిడీ కథ
ఈ మహా వంచనపై సీఐడీ డీఐజీ డాక్టర్ భీమా శంకర్ గుళేద్ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. శివం అసోసియేట్స్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఏకంగా 40,700 మంది ఖాతాదారుల నుంచి రూ.2,400 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసిందని చెప్పారు. ఎక్కువ వడ్డీలు ఇస్తామంటూ నమ్మించి సంస్థ అధినేత శివానంద నీలణ్ణనవర్ వేలాది మందిని నిలువునా ముంచేశాడని పేర్కొన్నారు. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ములో రూ.540 కోట్లను షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి, అందులో రూ.170 కోట్లను దారుణంగా పోగొట్టుకున్నాడని సీఐడీ దర్యాప్తులో తేలింది.
బాధితులకు సొమ్ము వాపస్ ఇచ్చే ప్రక్రియ
ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.330 కోట్లు మాత్రమే నిల్వ ఉన్నాయని, మరో రూ.660 కోట్ల నగదు ఎక్కడికి వెళ్లిందనే వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందని డీఐజీ తెలిపారు. ఇక మిగిలిన డబ్బును పాత మదుపుదారులకు రొటేషన్ పద్ధతిలో వడ్డీల రూపంలో చెల్లించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన ఐదు అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను పోలీసులు ఇప్పటికే జప్తు చేశారు. మోసపోయిన బాధితులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కోర్టు అనుమతితో జప్తు చేసిన సొమ్మును, ఆస్తులను మదుపుదారులకు తిరిగి ఇచ్చేసే ప్రక్రియను అతి త్వరలోనే ప్రారంభిస్తామని సీఐడీ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.




