Tamil Nadu: టాస్మాక్ లూటీపై సీఎం విజయ్ సీరియస్.. రూ. 1600 కోట్ల కుంభకోణంపై కఠిన చర్యలు!

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసఫ్ విజయ్ తొలి క్యాబినెట్ భేటీలోనే టాస్మాక్ (TASMAC) అవకతవకలపై ఉక్కుపాదం మోపారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 11:34 AM IST
Tamil Nadu
X

Tamil Nadu: టాస్మాక్ లూటీపై సీఎం విజయ్ సీరియస్.. రూ. 1600 కోట్ల కుంభకోణంపై కఠిన చర్యలు!

Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్‌)లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న భారీ ఆర్థిక అవకతవకలపై తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, అక్రమ పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ అధ్యక్షతన శుక్రవారం మొదటిసారి క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో టాస్మాక్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడులో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా రాష్ట్ర ఖజానాకే చేరేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అనధికారిక ‘పార్టీ ఫండ్’ వసూళ్ల పేరుతో ప్రతి నెలా దాదాపు 102 కోట్ల రూపాయలు టాస్మాక్ నుండి పక్కదారి మళ్లుతున్నట్లు సీఎం విజయ్ దృష్టికి వచ్చింది. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన దాదాపు 1,600 కోట్ల రూపాయలు దారి తప్పాయని ప్రభుత్వ అధికారులు సీఎంకు వివరించారు. డీఎంకే ప్రభుత్వం టాస్మాక్‌ను కేవలం తమ రాజకీయ లబ్ధి కోసమే వాడుకుందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌‌లో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు.

టాస్మా‌క్‌‌లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో.. గత ఏడాది (2025) మార్చి 6, 8 తేదీల్లో టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. అయితే, ఈ దాడులను సవాల్ చేస్తూ అప్పటి తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేస్తూ.. "మనీలాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే తీవ్రమైన నేరం" అని వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంలో అప్పటి తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ సర్కార్ ఈ లూటీపై కఠినంగా వ్యవహరిస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story