Zojila Tunnel : సరికొత్త చరిత్ర సృష్టించిన జోజిలా టన్నెల్.. ఆసియాకే కొత్త రికార్డు.!
Zojila Tunnel : శ్రీనగర్ , లడఖ్ ప్రజల రవాణా కష్టాలను తీరుస్తూ, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు నిర్మిస్తున్న ఆసియాలోనే అత్యంత పొడవైన..
Zojila Tunnel
Zojila Tunnel : శ్రీనగర్ , లడఖ్ ప్రజల రవాణా కష్టాలను తీరుస్తూ, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు నిర్మిస్తున్న ఆసియాలోనే అత్యంత పొడవైన 'జోజిలా సొరంగ మార్గం' (Zojila Tunnel) ప్రాజెక్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన మైలురాయి అయిన 'బ్రేక్‌థ్రూ' (సొరంగం రెండు చివరల తవ్వకాలు ఒకే చోట విజయవంతంగా కలవడం) జూన్ 9, 2026 మంగళవారం నాడు పూర్తయింది. దాదాపు 13 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రధాన సొరంగం తవ్వకం పనులు ఈ చారిత్రాత్మక బ్రేక్‌థ్రూ బ్లాస్టింగ్‌తో ముగిశాయి. మొత్తం రూ. 6,500 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఇంజనీరింగ్ అద్భుతం
ఈ సొరంగ మార్గాన్ని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్' (MEIL) నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల అత్యంత ప్రమాదకరమైన ఎత్తులో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సొరంగం సోన్‌మార్గ్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో, అలాగే శ్రీనగర్ నుండి 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయాల వంటి కఠినమైన పర్వత ప్రాంతాలలో సొరంగాలు తవ్వడానికి ఉపయోగించే అత్యాధునిక 'న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్' (NATM) సాంకేతికతను ఉపయోగించి MEIL దీనిని నిర్మిస్తోంది. భారతీయ పర్వత మౌలిక సదుపాయాల రంగంలోనే ఇదొక అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.
ప్రజల రవాణాకు , రక్షణ రంగానికి కొండంత అండ
ఈ జోజిలా టన్నెల్ అందుబాటులోకి రావడం వల్ల ద్రాస్, లేహ్ , కార్గిల్ ప్రాంతాలకు ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. ఇది కేవలం సాధారణ పౌరుల రవాణా సౌకర్యాన్ని , ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, వ్యూహాత్మకంగా రక్షణ రంగానికి, సైనిక రవాణాకు (లాజిస్టిక్స్) ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఈ చారిత్రాత్మక బ్రేక్‌థ్రూ వేడుకకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. "హిమాలయాల అత్యున్నత శిఖరాలపై రూపుదిద్దుకుంటున్న భారతదేశపు అత్యంత సవాలుతో కూడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జోజిలా టన్నెల్ ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మార్గదర్శకత్వంలో భారతీయ ఇంజనీర్లు సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, జూన్ 9, 2026న ప్రధాన సొరంగం బ్రేక్‌థ్రూతో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు" అని పేర్కొంది.
ఆర్థిక వృద్ధి, పర్యాటక రంగానికి సరికొత్త ఊతం
ప్రస్తుతం శీతాకాలంలో భారీగా కురిసే మంచు, మంచు తుఫానుల (అవలాంచెస్) కారణంగా జోజిలా పాస్ (జోజిలా కణమ) ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు పూర్తిగా మూతపడుతుంది. దీనివల్ల లడఖ్ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయేవి. ఈ సొరంగ మార్గం పూర్తికావడంతో ఈ రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా రవాణా సాగడమే కాకుండా, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి, పర్యాటక రంగం (టూరిజం) ఊపందుకుంటుంది , సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో తోడ్పడనుంది.




