Armoor: ఫామ్‌హౌస్‌లో జూదం దందా.. రూ.18300 నగదు, 2 క్రెటా కార్లు సీజ్

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌పై చీతా ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి మెరుపు దాడి చేశారు.

VAMSHI, ARMOOR
Published on: 24 May 2026 9:27 PM IST
Armoor
X

Armoor: ఫామ్‌హౌస్‌లో జూదం దందా.. రూ.18300 నగదు, 2 క్రెటా కార్లు సీజ్

Armoor: ఆర్మూర్ మండల్ చేపూర్ గ్రామం లో జూదం , పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిఘా తీవ్రం చేసిన పోలీసులు, తాజాగా ఆర్మూర్ పరిధిలో ఒక పెద్ద పేకాట స్థావరాన్ని బట్టబయలు చేశారు.

దాడి జరిగిన తీరు

పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు, CCS ఏసీపీ మస్తాన్ అలీ ప్రత్యక్ష పర్యవేక్షణలో చీతా ఫోర్స్ సిబ్బంది ఈరోజు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేపూర్ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పేకాట సాగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది.

ఈ సమాచారంతో చీతా టీం సభ్యులు అత్యంత వ్యూహాత్మకంగా, అకస్మాత్తుగా (మెరుపు దాడి) సాయన్న ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జూదరులను సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.

పట్టుబడిన నిందితులు & రికవరీ వివరాలు

ఈ మెరుపు దాడిలో పోలీసులు ముగ్గురు (3) పేకాట రాయుళ్లను సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు పేకాట రాయుళ్ల దగ్గర నుంచి స్వాధీన :

1) నగదు: రూ. 18,300/- (పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు)

2) వాహనాలు: జూదం ఆడటానికి వచ్చిన వారు ఉపయోగించిన 2 క్రేటా ( క్రెటా ) కార్లు

3) మొబైల్ ఫోన్లు: కమ్యూనికేషన్ కోసం వాడిన 3 సెల్ ఫోన్లు

తదుపరి చట్టపరమైన చర్యలు

రైడ్ విజయవంతంగా ముగిసిన అనంతరం , పట్టుబడిన ముగ్గురు నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, కార్లు మరియు సెల్ ఫోన్లను చీతా ఫోర్స్ సిబ్బంది తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్ ) కి అప్పగించారు. ఆర్మూర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్ వారి హెచ్చరిక:

జిల్లా వ్యాప్తంగా ఫామ్ హౌస్‌లు, తోటలు లేదా రహస్య ప్రదేశాలలో ఎలాంటి జూదం, పేకాట క్లబ్బులు నిర్వహించినా, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు (పీడీ యాక్ట్ వరకు) ఉంటాయని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు హెచ్చరించారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story