Vande Bharat Sleeper : వందే భారత్ స్లీపర్‌లో వీడియో వైరల్.. అంత స్పెషల్ ఏంటి.?

Vande Bharat Sleeper : భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ సుమారు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన..

G Krishna
Published on: 24 May 2026 9:26 AM IST
Vande-Bharat-Sleeper
X

Vande-Bharat-Sleeper

Vande Bharat Sleeper : భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ సుమారు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ‘వందే భారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) రైలు ప్రయాణీకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సరికొత్త తరం స్లీపర్ రైలులో ప్రయాణించిన ఒక మహిళా పర్యాటకురాలి అనుభవం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ రుచి త్రివేది తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్: న్యూ జనరేషన్ స్లీపర్ ట్రైన్ ఇన్ ఇండియా’ పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ రైలు ప్రయాణం తన మైండ్ బ్లాక్ చేసిందని, రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ అత్యాధునిక రైలు అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఉందంటూ ఆమె ప్రశంసల వర్షం కురిపించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కోచ్ డిజైన్

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో రుచి త్రివేది వందే భారత్ స్లీపర్ క్లాస్ సెకండ్ ఏసీ (2nd AC) కోచ్‌లోని లగ్జరీ వసతులను వీక్షకులకు చూపించారు. కోచ్‌లోని కర్టెన్లు, అత్యాధునిక లైటింగ్ సిస్టమ్, బెడ్డింగ్ , సీట్ల లేఅవుట్ చాలా ప్రీమియంగా ఉన్నాయని ఆమె కొనియాడారు. "ప్రస్తుతం మనం వందే భారత్ స్లీపర్ కోచ్ సెకండ్ ఏసీలో కూర్చున్నాం. ఇక్కడి కర్టెన్లు, లైట్లు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. ఈ రైలు ప్రమాణాలను చూస్తుంటే పూర్తిగా అంతర్జాతీయ స్థాయికి (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్) తీసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది" అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. అలాగే ప్రయాణీకులకు అందించిన బెడ్డింగ్, సరికొత్త డిజైన్‌తో కూడిన బ్లాంకెట్ కవర్లు చాలా తాజాగా, శుభ్రంగా ఉన్నాయని ఆమె అభినందించారు.

రైలును శుభ్రంగా ఉంచడం మన బాధ్యత

ఈ లగ్జరీ రైలును చూసి మురిసిపోవడమే కాకుండా, ప్రయాణీకులకు రుచి త్రివేది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. "ఈ రైలు అద్దంలా మెరిసిపోతోంది. కానీ ప్రయాణీకులైన మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వందే భారత్ రైలును ఎప్పుడూ ఇలాగే ఇంతే పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కనీస బాధ్యత (సివిక్ సెన్స్)" అని ఆమె ప్రయాణీకులకు పిలుపునిచ్చారు. ఈ రైలులో ప్రయాణించడం తన జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆమె వీడియో క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

నెటిజన్ల మద్దతు.. ప్రజా స్పందన

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. భారతీయ ప్రయాణీకులకు ఇంతటి అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించినందుకు నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే శాఖను అభినందిస్తున్నారు. అదే సమయంలో, రైలును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ఈ రైలు అంతర్జాతీయ ప్రమాణాలను అలాగే కాపాడుకోవడం మన భారతీయుల బాధ్యత" అని రాయగా, మరొకరు.. "ప్రభుత్వం ఎప్పుడూ మంచి వసతులనే కల్పిస్తుంది, కానీ మన ప్రజలే పరిశుభ్రతను పాటించడంలో విఫలమవుతున్నారు. ఈసారైనా బుద్ధిగా నడుచుకోవాలి" అని కామెంట్ చేశారు. "మన తోటి భారతీయులు ఈ రైలును ఎలా చూసుకుంటారో నేను చూడాలనుకుంటున్నాను.. ప్రభుత్వం తన పని పూర్తి చేసింది, ఇప్పుడు మన సివిక్ సెన్స్ చూపించాల్సిన వంతు వచ్చింది" అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సరికొత్త రికార్డుల దిశగా వందే భారత్ ప్రయాణం

2019 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన వందే భారత్ రైళ్లు.. ఇప్పటివరకు లక్షకు పైగా సర్వీసుల ద్వారా ఏకంగా 9.1 కోట్లకు పైగా ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే (FY 2025-26) దాదాపు 3.98 కోట్ల మంది ప్రయాణీకులు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఇది అంతకుముందు ఏడాదితో (2.97 కోట్లు) పోలిస్తే దాదాపు 34 శాతం అద్భుతమైన వృద్ధిని కనబరిచింది.

ఇక ఇటీవల ప్రారంభమైన కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్ సర్వీస్ కేవలం మూడు నెలల్లోనే, కేవలం 119 ట్రిప్పులలోనే 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కొద్ది కాలంలోనే ఏకంగా 1.21 లక్షల మంది ప్రయాణీకులు ఈ రైలులో ప్రయాణించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, భారతీయ ప్రయాణీకులు ప్రీమియం ఓవర్‌నైట్ (రాత్రి వేళ ప్రయాణించే) రైలు సేవలపై , వందే భారత్ బ్రాండ్‌పై ఎంతటి నమ్మకాన్ని ఉంచారో స్పష్టంగా అర్థమవుతోంది.




G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story