Ice Cream: ఒక్క స్కూప్ ఐస్‌క్రీమ్ ఏకంగా రూ. 5.29 లక్షలు.. ఎందుకింత స్పెషలో తెలుసా?

Ice Cream: ఒక్క స్కూప్ ఐస్‌క్రీమ్ ధర రూ. 5.29 లక్షల పైమాటే! జపాన్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌లో ఏముందంటే.?

Ravi
By Ravi
Published on: 27 May 2026 3:28 PM IST
Ice Cream
X

Ice Cream: ఒక్క స్కూప్ ఐస్‌క్రీమ్ ఏకంగా రూ. 5.29 లక్షలు.. ఎందుకింత స్పెషలో తెలుసా?

Ice Cream: నెల నెలా బడ్జెట్ వేసుకుంటూ, పది రూపాయల ఐస్‌క్రీమ్ కొనడానికి కూడా ఎంతో ఆలోచించే రోజులివి. ఎండకాలం వస్తే చాలు, సాయంత్రం కాగానే చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. రోడ్డు పక్కన బండి దగ్గర దొరికే పది రూపాయల కుల్ఫీ నుంచి, మాల్స్‌లో దొరికే వంద రూపాయల కప్పు వరకు మన బడ్జెట్‌ను బట్టి లాగించేస్తాం. కానీ, ఎక్కడైనా ఒక్క స్కూప్ ఐస్‌క్రీమ్ ధర ఏకంగా రూ. 5.29 లక్షలు ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? అవును, మీరు విన్నది అక్షరాలా నిజం! ఆ డబ్బుతో మన దేశంలో ఒక మంచి లగ్జరీ కారు కొనొచ్చు .అంత ఖరీదైన ఐస్‌క్రీమ్ తినడం సామాన్యులకు అసాధ్యం. జపాన్‌కు చెందిన ఒక కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి, ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కింది.

ఈ వింత ఐస్‌క్రీమ్ పేరు 'బ్యాకుయా'. జపనీస్ భాషలో దీని అర్థం 'వైట్ నైట్' అని. జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ 'సెలెటో' దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. దీని ఒక్క స్కూప్ ధర దాదాపు ఎనిమిది లక్షల జపనీస్ యెన్.. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 5.29 లక్షల పైమాటే! అంత ధర పెట్టడానికి ఇందులో ఏముంది అని అందరికీ సందేహం రావడం సహజం. దీని తయారీలో వాడిన పదార్థాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇందులో ఇటలీలోని ఆల్బా ప్రాంతంలో మాత్రమే లభించే అత్యంత అరుదైన 'వైట్ ట్రఫుల్' అనే పుట్టగొడుగును ఉపయోగించారు. దీని ధర కిలోకు దాదాపు పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది. దీని రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయట. దీనితో పాటు జపాన్‌కు చెందిన సాంప్రదాయ పదార్థమైన 'సకే లీస్', పైన అలంకరణ కోసం తినదగిన అసలైన బంగారు వర్ణపు రేకులు వాడారు.

ఒసాకాలోని ఫ్యూజన్ వంటకాలకు పేరొందిన ప్రముఖ చెఫ్ 'తడయోషి యమద' పర్యవేక్షణలో యూరోపియన్, జపనీస్ రుచుల కలయికతో ఒకటిన్నర సంవత్సరం పాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ఐస్‌క్రీమ్‌ను తయారు చేశారు. ఇది కేవలం తినే పదార్థం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కళాఖండం అని సెలెటో కంపెనీ గర్వంగా చెబుతోంది. దీనిని ఆర్డర్ చేస్తే, తినడానికి ప్రత్యేకంగా క్యోటోలోని హస్తకళా నిపుణులు చేత్తో తయారు చేసిన ఒక వెండి స్పూన్‌ను కూడా ఈ విలాసవంతమైన బాక్స్‌తో పాటు ఇస్తారు.

ఈ ఐస్‌క్రీమ్ తిన్న కొందరు అదృష్టవంతులు దీని రుచి నిజంగా చాలా అద్భుతంగా ఉందని, వైట్ ట్రఫుల్ ఘాటైన సువాసనతో నోట్లో వెన్నలా కరిగిపోతుందని సెలవిచ్చారు. మనలాంటి సామాన్యులకు ఇది కేవలం వినడానికి ఒక వింత మాత్రమే కావచ్చు. కానీ ప్రపంచంలో ధనవంతుల విలాసాలు, వారి విచిత్రమైన సరదాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story