Saptapadi: జీవితంలో వచ్చే కష్టాలకు...వివాహంలో జరిగే ఈ క్రతువే కారణం... శాస్త్రోక్తంగా నిర్వహించకుంటే
వైవాహిక బంధం బలంగా ఉండాలన్నా...జీవితంలో కష్టాలు ఎదురుకాకూడదన్నా... వివాహ మహోత్సవంలో సప్తపదిని శాస్త్రోక్తంగా నిర్వహించాలని పెద్దలు చెబుతున్నారు.
Saptapadi: హైందవ సనాతన ధర్మంలో వివాహం అనేది కేవలం ఒక వేడుక కాదు. అది రెండు ఆత్మలను ఏకం చేసే ఒక పవిత్రమైన యజ్ఞం. అయితే, నేటి ఆధునిక కాలంలో 100 కి పైగా పెళ్లిళ్లలో దాదాపు 40 శాతం వివాహాలు కేవలం ఆడంబరాలకే పరిమితమవుతున్నాయి. పెళ్లిలోని అత్యంత ప్రధానమైన ఘట్టం ‘సప్తపది’ దీనినే వాడుక భాషలో ఏడు అడుగుల క్రతువు అని పిలుస్తారు. చాలామంది సమయం లేకనో, తెలియకనో తూతూమంత్రంగా ముగిస్తున్నారు. శాస్త్రోక్తంగా సప్తపది నిర్వహించకపోవడమే నేటి దంపతుల జీవితాల్లో వచ్చే అనేక కష్టాలకు, విడాకులకు ప్రధాన కారణమని వేద పండితులు హెచ్చరిస్తున్నారు.
సప్తపది అంటే ఏమిటి? రహస్యాలు ఇవే
అగ్నిసాక్షిగా వధూవరులు ఇద్దరూ కలిసి నడిచే ఏడు అడుగుల ప్రయాణమే సప్తపది. ఈ ఏడు అడుగులకు విడివిడిగా ఏడు రకాల విశిష్టమైన అర్ధాలు ఉన్నాయి. శాస్త్రం ప్రకారం ఒక్కో అడుగు ఒక్కో బాధ్యతను గుర్తు చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సప్తపదిలో వేసే మొదటి అడుగు ఆహారం సమృద్ధిగా ఉండాలని, రెండో అడుగు శారీరక, మానసిక బలం కోసం, మూడో అడుగు ధన ధాన్యాలకు లోటు ఉండకూడదని, సంపాదన ధర్మబద్ధంగా ఉండాలని కోరుకుంటారు. ఇక నాలుగో అడుగు పరస్పర ఆనందం, కుటుంబ సౌఖ్యం కోసం వేస్తారు. ఐదో అడుగు ఉత్తమ సంతానం పొందాలని, ఆరో అడుగు అన్ని ఋతువుల్లోనూ, కష్ట సుఖాల్లోనూ కలిసి జీవించాలని కోరుకుంటూ వేస్తారు. ఇక ఏడో అడుగు జీవితాంతం విడిపోకుండా, ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటూ సప్తపదిలో నడుస్తారు.
శాస్త్రోక్తంగా చేయకుంటే వచ్చే నష్టాలు
సప్తపది అనేది కేవలం నడక కాదు, అది దేవతల సమక్షంలో చేసుకునే ప్రమాణం. ఈ క్రతువును సరిగ్గా నిర్వహించకుంటే ఆ వివాహం శాస్త్రపరంగా అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సప్తపది లోపించడం పెళ్లి జరిగిన కొన్ని రోజుల్లోనే దంపతుల మధ్య తీవ్రమైన అపార్థాలు, మనస్పర్థలు, మానసిక దూరం పెరుగుతాయి. అంతేకాదు, దీనివలన పితృదోషాలు, వంశ వృద్ధికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి.
అగ్ని ప్రదక్షిణ.... సూర్యభగవానుడి రక్షణ
సప్తపదిలో భాగంగా హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల విశ్వశక్తి అయిన సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అగ్నిదేవుడు ఆ బంధానికి సాక్షిగా ఉంటాడు. ఈ పవిత్రమైన ఏడు అడుగుల క్రతువును భక్తిశ్రద్ధలతో, మంత్రయుక్తంగా చేసుకున్నప్పుడే ఆ ఇల్లే ఒక దేవాలయంగా మారుతుంది. వివాహాన్ని కేవలం ఫొటోల కోసం కాకుండా, శాస్త్రబద్ధంగా జరిపించుకోవడం వలన జీవితం నిండు నూరేళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పంచభూతాలు ప్రసాదిస్తాయి. పూర్వం రోజుల్లో వివాహం శాస్త్రబద్ధంగా జరిగాయి కాబట్టే చాలా వరకు కుటుంబం బంధాలు బలంగా ఉన్నాయి. కానీ, ఈ రోజుల్లో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా... ఒక్కసారి ఆలోచించండి.




