IPL Cheerleader: చీర్‌లీడర్‌‌కు చీటి విసిరిన ఫ్యాన్.. కథ అడ్డం తిరిగిందే!

IPL Cheerleader: లక్నో ఇటానా స్టేడియంలో జరిగిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో విదేశీ చీర్‌లీడర్‌ పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.

Naresh.k
Updated on: 24 May 2026 5:53 PM IST
IPL Cheerleader
X

IPL Cheerleader: చీర్‌లీడర్‌‌కు చీటి విసిరిన ఫ్యాన్.. కథ అడ్డం తిరిగిందే!

IPL Cheerleader: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రసవత్తర పోరు ముగింపు దశకు చేరుకున్న వేళ, లక్నో వేదికగా క్రీడా స్ఫూర్తిని మంటగలిపేలా ఒక సిగ్గుచేటు సంఘటన వెలుగుచూసింది. మైదానంలో ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపిస్తుంటే.. గ్యాలరీలో ఉన్న కొందరు ఆకతాయిలు మాత్రం పరిధులు దాటి ప్రవర్తించారు. స్టేడియంలో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్న ఒక విదేశీ చీర్‌లీడర్‌ను తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి విమర్శలకు దారితీస్తోంది. ఒకవైపు పంజాబ్ జట్టు అద్భుత విజయంతో పండగ చేసుకుంటుంటే, మరోవైపు జరిగిన ఈ ఘటన ఐపీఎల్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అసలేం జరిగిందంటే..?

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇటానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. బౌండరీ లైన్ సమీపంలో విదేశీ చీర్‌లీడర్లు తమ జట్టును ఉత్సాహపరుస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న కొందరు యువకులు మితిమీరి ప్రవర్తించారు.

ఒక ఆకతాయి కాగితం ముక్కపై తన మొబైల్ నంబర్ రాసి, బౌండరీ లైన్ పక్కనే ఉన్న చీర్‌లీడర్‌పైకి విసిరాడు. ఆ కాగితం ఆమెకు బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తీవ్ర ఆందోళనకు లోనైన ఆ యువతి.. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని, తమను గౌరవించాలని అక్కడున్న అభిమానులను చేతులెత్తి వేడుకుంది. వినోదాన్ని పంచేందుకు వచ్చే మహిళలపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై నిజమైన క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు

చీర్‌లీడర్‌ పట్ల ఆకతాయిల ప్రవర్తన మితిమీరడంతో స్టేడియంలో ఉన్న తోటి ప్రేక్షకులు వెంటనే అలర్ట్ అయ్యి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. పరిస్థితి చేయి దాటకముందే లక్నో పోలీసులు, ముఖ్యంగా మహిళా పోలీసులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు. బాధితురాలికి రక్షణగా నిలిచి, గొడవకు కారణమైన ఆకతాయిలకు గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పెట్టడంతో, ఐపీఎల్ యాజమాన్యం స్టేడియాల్లో మహిళల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story