MI vs RR: ముంబై-రాజస్థాన్ మ్యాచ్‌లో సరదా ఘటన.. శార్దూల్ ను ఆటపట్టించిన జడేజా!

MI vs RR: రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మధ్య జరిగిన సరదా సంఘటన అభిమానులను ఆకట్టుకుంది.

Rishvik
Updated on: 24 May 2026 6:46 PM IST
MI vs RR
X

MI vs RR: ముంబై-రాజస్థాన్ మ్యాచ్‌లో సరదా ఘటన.. శార్దూల్ ను ఆటపట్టించిన జడేజా!

MI vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మధ్య జరిగిన సరదా సంఘటన అభిమానులను ఆకట్టుకుంది. ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ జరగగా.. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జడేజా, శార్దూల్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌ వేశాడు. నాలుగో బంతిని శార్దూల్ స్లో డెలివరీ వేయగా.. రవీంద్ర జడేజా షాట్ ఆడాడు. జడ్డు ఆడిన షాట్ కవర్ వైపు వెళ్లగా.. హార్దిక్ పాండ్యా క్యాచ్ అందుకున్నాడు. వికెట్ పడడంతో జడేజా వైపు చూస్తూ.. శార్దూల్ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే వెంటనే థర్డ్ అంపైర్ అది నోబాల్ అని ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నోబాల్‌గా ప్రకటించిన వెంటనే జడేజా కూడా సరదాగా శార్దూల్ సెలబ్రేషన్‌ను అనుకరించాడు. దాంతో ఇద్దరు సరదాగా నవ్వుకున్నారు.

రవీంద్ర జడేజా అక్కడితో ఆగకుండా శార్దూల్ ఠాకూర్‌ వేసిన తరువాతి రెండు బంతులకు వరుసగా బౌండరీలు బాదాడు. దాంతో మరోసారి శార్దూల్‌ను జడ్డు ఆటపట్టించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే,.. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో జోఫ్రా ఆర్చర్, జడేజా మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు మంచి స్కోరు అందించారు. ఆర్చర్ కేవలం 15 బంతుల్లో 32 పరుగులు చేయగా.. జడేజా 11 బంతుల్లో అజేయంగా 19 పరుగులు చేశాడు.

అంతకుముందు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ కీలక మ్యాచులో నిరాశపర్చారు. వైభవ్ (4) త్వరగా అవుట్ కాగా.. జైస్వాల్ 27 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ధ్రువ్ జురెల్ (38), దాసున్ శనక (29), డోనోవన్ ఫెరీరా (18) కీలక రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు కీలక వికెట్లు తీశాడు. విల్ జాక్స్ అద్భుత ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. చివర్లో జడేజా-ఆర్చర్ దూకుడు కారణంగానే రాజస్థాన్ 200 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. అయితే మ్యాచ్‌లో జడేజా-శార్దూల్ మధ్య జరిగిన సరదా సంఘటన మాత్రం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story