Sachin Tendulkar: క్రికెట్ సహనాన్ని కూడా పరీక్షిస్తుంది.. సచిన్ టెండూల్కర్ భావోద్వేగ పోస్ట్!

Sachin Tendulkar: ఐపీఎల్ 2026లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు.

Rishvik
Published on: 24 May 2026 6:06 PM IST
Sachin Tendulkar
X

Sachin Tendulkar: క్రికెట్ సహనాన్ని కూడా పరీక్షిస్తుంది.. సచిన్ టెండూల్కర్ భావోద్వేగ పోస్ట్!

Sachin Tendulkar: ఐపీఎల్ 2026లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ)కు ప్రాతినిధ్యం వహించిన అర్జున్.. శనివారం పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఈ సీజన్లో అర్జున్ ఆడిన మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. లక్నో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడినా.. అర్జున్ తన ప్రదర్శనతో మంచి గుర్తింపు సంపాదించాడు. తన కుమారుడు అరంగేట్రం చేసిన సందర్భంగా సచిన్ భావోద్వేగ పోస్టుతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. ఇక నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. లక్నో బౌలర్లలో అర్జున్‌ ఎకానమీనే తక్కువ కావడం గమనార్హం. పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ వికెట్‌ను అద్భుత యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూగా పడగొట్టి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అర్జున్ తొలి ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్ చేసే అవకాశం కూడా వచ్చింది. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ సులభ క్యాచ్‌ను వదిలేయడంతో ఆ వికెట్ చేజారింది. అయినప్పటికీ తన మూడో ఓవర్‌లో అర్జున్ అతడి వికెట్ సాధించాడు.

తన కుమారుడి ప్రదర్శనపై స్పందించిన సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. 'బాగా ఆడావు అర్జున్. ఈ సీజన్ మొత్తం నువ్వు ఎంతో సహనంతో, నమ్మకంతో ఎదురుచూసిన తీరు నాకు గర్వంగా ఉంది. అవకాశాల కోసం చివరి మ్యాచ్ వరకు ఎదురుచూసినా.. ఎప్పుడూ కష్టపడి పని చేశావు. క్రికెట్ కేవలం ప్రతిభనే కాదు..సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. ఈరోజు నువ్వు రెండింటినీ అద్భుతంగా హ్యాండిల్ చేశావు. నువ్వు ఎప్పటిలాగే ఆటను ప్రేమిస్తూ ముందుకు సాగాలి. మేమంతా నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అని సచిన్ తన కుమారుడిపై ప్రేమను వ్యక్తం చేశారు.

అర్జున్ ప్రదర్శనపై ఆర్ అశ్విన్‌ కూడా ప్రశంసలు కురిపించాడు. తాను అర్జున్ నైపుణ్యం గురించి మాట్లాడను కానీ.. అతడి క్రికెటింగ్‌ ప్రయాణం చాలా కఠినమైందన్నాడు. తన తండ్రితో పోలిస్తే అవకాశాలు పెద్దగా రావడం లేదన్నాడు. అర్జున్ చాలా కష్టపడే వ్యక్తి అని, అలాగే పోటీ నుంచి ఎప్పుడూ వెనకడుగు వేసే రకం కాదని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 అర్జున్ టెండూల్కర్ కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. ఎందుకంటే అతడు ముంబై ఇండియన్స్ కాకుండా మరో ఫ్రాంచైజీ తరఫున ఆడిన తొలి సీజన్. ఐపీఎల్ 2026 వేలానికి ముందు అతడిని ముంబై నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story