ఫోన్ వేడెక్కితే ముందుగా దెబ్బతినే భాగం ఇదే.. మీ మొబైల్ సేఫ్‌గా ఉందా.?

వేసవి కాలంలో మొబైల్ ఫోన్లు వేడెక్కడం అనేది ఇప్పుడు చాలా సాధారణ సమస్యగా మారింది.

G Krishna
Published on: 24 May 2026 11:00 AM IST
Phone-Heat
X

Phone-Heat

ఎండలు మండిపోతున్నాయి. ఈ భానుడి భగభగలు కేవలం మనుషులనే కాకుండా, మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వేసవి కాలంలో మొబైల్ ఫోన్లు వేడెక్కడం (Overheating) అనేది ఇప్పుడు చాలా సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు ఫోన్ ఎంతలా వేడెక్కుతుందంటే, దాన్ని కనీసం చేతితో పట్టుకోవడం కూడా కష్టంగా మారుతుంది. నిరంతరంగా గేమ్స్ ఆడటం, ఎండలో ఎక్కువసేపు వీడియోలు రికార్డ్ చేయడం, ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం వంటి కారణాల వల్ల పరికరం వేగంగా వేడెక్కుతుంది. ఈ వేడి మరీ ఎక్కువైతే కొన్ని సందర్భాల్లో ఫోన్లు పేలిపోవడం , మంటలు అంటుకోవడం వంటి ఘోర ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ వేసవిలో ఫోన్ వేడెక్కినప్పుడు అసలు ఏ భాగం దెబ్బతింటుంది? దాన్ని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.

అధిక వేడి వల్ల మొదట దెబ్బతినేది ఇదే

మొబైల్ రంగానికి చెందిన సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్ విపరీతంగా వేడెక్కినప్పుడు అన్నింటికంటే మొదట తీవ్రంగా ప్రభావితమయ్యేది దాని బ్యాటరీ. నిరంతరం అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల బ్యాటరీ లైఫ్ , సామర్థ్యం క్రమంగా తగ్గిపోతాయి. కొన్నిసార్లు బ్యాటరీ లోపల గ్యాస్ చేరి ఉబ్బడం (Battery Swelling) మొదలవుతుంది. దీనివల్ల ఛార్జింగ్ చాలా వేగంగా అయిపోవడం, ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను అలాగే నిర్లక్ష్యం చేస్తే, బ్యాటరీతో పాటు ఫోన్‌కు గుండెకాయ లాంటి ‘మదర్‌బోర్డ్’, అత్యంత కీలకమైన ‘ప్రాసెసర్’ కూడా పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ వేడెక్కడాన్ని తేలికగా తీసుకుంటే భారీగా ఖర్చవుతుంది.

ఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణాలు

స్మార్ట్‌ఫోన్లు నిప్పులు చెరగడానికి మన దైనందిన అలవాట్లే ప్రధాన కారణం. ఎక్కువసేపు భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడటం, హై-రిజల్యూషన్ (4K) వీడియోలను రికార్డ్ చేయడం, నిరంతరంగా రీల్స్, వీడియోలు స్ట్రీమింగ్ చేయడం వల్ల ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వీటికి తోడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకేసారి అనేక యాప్‌లను రన్ చేయడం, నెట్‌వర్క్ సరిగా లేనప్పుడు ఇంటర్నెట్ వాడటం కూడా ఫోన్ ఉష్ణోగ్రతను పెంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం, స్థానిక (లోకల్), పాత ఛార్జర్లను వాడటం, మొబైల్ స్టోరేజ్ పూర్తిగా నిండిపోవడం వల్ల కూడా పరికరం వేడెక్కుతుంది. చాలా మంది ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు వేడి గాలి బయటకు పోకుండా ఉండేలా బెడ్ షీట్లపై, దిండ్ల కింద ఉంచుతారు, దీనివల్ల ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.

తీవ్రమైన ఎండలు ప్రమాదకరం.. అలాగని ఫ్రిజ్‌లో పెట్టకండి

వేసవి కాలంలో మీ ఫోన్‌ను నేరుగా సూర్యరశ్మి పడే చోట , పార్కింగ్ చేసిన కారు లోపల ఉంచడం అత్యంత ప్రమాదకరమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో కారు లోపల ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతాయి, ఇది ఫోన్ పేలడానికి దారితీస్తుంది. మరోవైపు, ఫోన్ విపరీతంగా వేడెక్కినప్పుడు దాన్ని త్వరగా చల్లబరచడానికి చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. దాన్ని తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్‌లో, మంచు ముక్కల పక్కన పెట్టడం. ఇలా చేయడం వల్ల ఫోన్ ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వస్తాయి. దీనివల్ల కారు అద్దాలపై పొగమంచు పట్టినట్లు, ఫోన్ లోపలి భాగాలలో తేమ (Condensation) పేరుకుపోతుంది. ఈ తేమ కారణంగా అంతర్గత సర్క్యూట్లు షార్ట్ సర్క్యూట్ అయి ఫోన్ పూర్తిగా డెడ్ అయిపోతుంది.

ఫోన్ మరీ వేడెక్కితే వెంటనే చేయాల్సిన పనులు



ఛార్జర్ తొలగించండి: ఫోన్ ఛార్జింగ్‌లో ఉంటే వెంటనే ప్లగ్ తీసేయండి.

బ్యాక్ కవర్ తీసేయండి: ఫోన్ వేడి బయటకు పోవడానికి అడ్డుగా ఉండే మందపాటి వెనుక కవర్‌ను (Pouch) వెంటనే తొలగించండి.

ఎయిర్‌ప్లేన్ మోడ్, స్విచ్ ఆఫ్: ఫోన్‌ను కాసేపు ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. బలహీనమైన నెట్‌వర్క్ ఉన్నప్పుడు ఫోన్ నిరంతరం సిగ్నల్ కోసం వెతుకుతూ ఉంటుంది, ఇది బ్యాటరీ, ప్రాసెసర్‌పై ఒత్తిడిని పెంచుతుంది. డేటా, మొబైల్ నెట్‌వర్క్‌ను తాత్కాలికంగా ఆపేయడం వల్ల ఫోన్ త్వరగా చల్లబడుతుంది.

ఆండ్రాయిడ్ వినియోగదారులు మార్చుకోవాల్సిన సెట్టింగ్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎప్పుడూ కూల్‌గా ఉండాలంటే సెట్టింగ్స్‌లో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం మంచిది. ఫోన్‌లో అవసరం లేనప్పుడు ‘వై-ఫై స్కానింగ్’ (Wi-Fi Scanning), ‘బ్లూటూత్ స్కానింగ్’ (Bluetooth Scanning) ఆప్షన్లను ఆఫ్ చేయండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసర యాప్‌ల లొకేషన్, మైక్రోఫోన్ అనుమతులను (Permissions) తొలగించండి.

ఇప్పుడు వస్తున్న చాలా ఫోన్లలో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటోంది. వేసవి కాలంలో ఈ రిఫ్రెష్ రేట్‌ను 60Hz కి తగ్గించుకోవడం వల్ల డిస్‌ప్లేపై భారం తగ్గి, బ్యాటరీ ఆదా అవ్వడమే కాకుండా ఫోన్ తక్కువగా వేడెక్కుతుంది. మీ ఫోన్‌లో 'ఫాస్ట్ ఛార్జింగ్' ఆప్షన్ ఉండి, కారు, గదిలో ఫోన్ నిరంతరం వేడెక్కుతుంటే, వేసవి ముగిసే వరకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను తాత్కాలికంగా డిసేబుల్ చేయడం చాలా సురక్షితమైన పద్ధతి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story