Shatavahana: అడ్మిషన్లు రద్దు చేయండి.. లేదంటే వర్సిటీ ముట్టడి
Shatavahana: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్లు తిష్ట వేశారని, వారి వల్ల విద్యా వాతావరణం దెబ్బతింటోందని పీహెచ్డీ స్కాలర్లు ఉపకులపతికి మెమోరండం సమర్పించారు.
Shatavahana: అడ్మిషన్లు రద్దు చేయండి.. లేదంటే వర్సిటీ ముట్టడి
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అక్రమంగా తిష్ట వేసిన సంబంధంలేని వ్యక్తులను యూనివర్సిటీ నుండి వెళ్ళగొట్టాలని ఉపకులాపతికి మెమోరండం సమర్పించిన విద్యార్థి సంఘ నాయకులు. నైతం మహేష్ మాట్లాడుతూ. శాతవాహన విశ్వవిద్యాలయ పీజీ మరియు పరిశోధక విద్యార్థులం గత వారం రోజులుగా విశ్వవిద్యాలయంలో అర్బన్ నక్సలైట్ల తిష్ట అనే వార్తలు మమ్మల్ని విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విశ్వవిద్యాలయ ప్రతిష్టను, విద్యా వాతావరణాన్ని ఈ అర్బన్ నక్సలైట్లు చెడగొడుతున్నారు. దీనివల్ల విశ్వవిద్యాలయ విద్యార్థులకు రావాల్సిన క్యాంపస్ ప్లేస్ మెంట్లు, ఇతర ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం కలదు. కొంతమంది వారి యొక్క వ్యక్తిగత స్వార్థంతో విశ్వవిద్యాలయ ప్రతిష్టను నీరుగార్చే ఉద్దేశంతో డబుల్ పీజీలు చేస్తూ విశ్వవిద్యాలయ సిబ్బందిని, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
గతంలో కొందరు నిషేధిత మావోయిస్టు సంస్థలలో పనిచేస్తూ శాతవాహన విశ్వవిద్యాలయంలో అనేక అలజడులను సృష్టించారు. మళ్లీ అదే విధమైనటువంటి అలజడులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్టి అర్బన్ నక్సలైట్ల చర్యల వల్ల మా యొక్క తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున అట్టి వ్యక్తి, వ్యక్తుల యొక్క అడ్మిషన్ రద్దు చేస్తూ,
వాళ్ళకు సహకరించిన వ్యక్తులను అర్బన్ నక్సలైట్లుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల రానున్న రోజుల్లో యూనివర్సిటీ ముట్టడికైనా వెనకాడ పోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయ పిహెచ్డి స్కాలర్స్ బోడకుంట రమేష్, నైతం సాయి కృష్ణ, కుంజ వర్మతేజా తదితరులు పాల్గొన్నారు.




